సాయిరామ్‌ను మెరుగైన
వైద్యానికి తరలింపు
అమలాపురం టౌన్: స్థానిక మహిపాలవీఽధిలోని ఓ డాబా పైఅంతస్తులో జరిగిన విస్ఫోటంలో దెబ్బతిన్న వస్తువుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను అమలాపురం పోలీసులు రాజమహేంద్రరం ఫోరెన్సిక్‌కు ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే ఆ ఇంట్లో అసలేం జరిగిందో పూర్తి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. దాని ఆధారంగానే దర్యాప్తు ఉంటుందని చెప్పారు. ప్రాథమికంగా డాబా పైఅంతస్తు టైట్ ప్యాకింగ్ మాదిరిగా ఉండడం వల్లే అందులో ఉన్న ఇన్వర్టర్ పేలి గ్యాస్ రావడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ చెబుతున్నారు. అయితే ఇంటి యజమాని, బాధిత మున్సిపల్ ప్రధానోపాధ్యాయుడు మలిశెట్టి మూర్తి మాత్రం పైకారణాలతో విస్ఫోటం జరిగి ఉంటుందని చెబుతూనే, విద్యుత్ సరఫరా పరంగా కొన్ని లోపాలు ఉండడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని అంటున్నారు. మూర్తి పెద్ద కుమారుడు సాయిరామ్ విస్ఫోటంలో తీవ్రంగా గాయపడి ప్రాథమిక వైద్యం స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో పొందాడు. అయితే అతనికి పరుపు నుంచి వచ్చిన మంటల వల్ల శరీరంలో పలుచోట్ల కాలిపోయి గాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు ఆదివారం సాయంత్రం నుంచి కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయిరామ్ అక్కడే చికిత్స పొందుతున్నాడు.
డీఈఓ సందర్శన
మున్సిపల్ ప్రధానోపాధ్యాయుడు మూర్తి ఇల్లు విస్ఫోటనానికి గురికావడంతో డీఈఓ డాక్టర్ మెహబూబ్ బాషా ఆ ఇంటిని సోమవారం సాయంత్రం పరిశీలించారు. మూర్తిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. డీఈఓ వెంట స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.ఘన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


