భద్రత లేని బతుకులు | - | Sakshi
Sakshi News home page

భద్రత లేని బతుకులు

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

దశాబ్దాల సేవకు గుర్తింపు కరవు

కనీస వేతనానికి

నోచని వీబీ జీ రామ్‌ జీ సిబ్బంది

ఇతర సమస్యలూ

పరిష్కరించాలని డిమాండ్‌

రాయవరం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా తమ పరిస్థితి ఉందని వీబీ జీ రామ్‌ జీ (ఉపాధి హామీ పథకం) ఫీల్డ్‌ అసిస్టెంట్లు వాపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ఈ పథకం అమలైంది. దీని పేరును కేంద్రం ఇటీవల వికసిత్‌ భారత్‌ – గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌(గ్రామీణ్‌)గా మార్చింది. పేరైతే మార్చింది కానీ, ఈ పథకం అమలులో కీలకమైన ఫీల్డ్‌ అసిస్టెంట్లు మాత్రం చాలీచాలని జీతాలు, భద్రత లేని విధులతో నలిగిపోతూనే ఉన్నారు. రెండు దశాబ్దాలుగా లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నా తమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేతనాల కోసం నిరీక్షణే..

ప్రతి నెలా మొదటి రోజున వేతనాలు చెల్లించాలనే నిబంధన వీరి విషయంలో అమలు కావడం లేదు. ఒక్కోసారి ఐదారు నెలల వరకూ ఎదురు చూపులు తప్పడం లేదు. జూన్‌ నెల వేతనం కోసం కాంట్రాక్టు, ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్‌ ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. తమపై సవతి తల్లి ప్రేమ చూపడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,300 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, జూనియర్‌ ఇంజినీర్లు వీబీ జీ రామ్‌ జీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా క్షేత్ర స్థాయిలో 13 వేల మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 50 మంది వరకూ ఏపీఓలు, అలాగే ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, జేఈలు, 150 మంది వరకూ కంప్యూటర్‌ ఆపరేటర్లు, సుమారు 200 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో సుమారు 1,200 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉన్నారు.

గ్రేడ్‌ ఫిక్సేషన్‌లో అన్యాయం

ఏపీఓలకు రెండేళ్ల క్రితం గ్రేడ్‌ ఫిక్సేషన్‌ చేయగా, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు పదేళ్ల క్రితమే ఈ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జూనియర్‌ ఇంజినీర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో పాటు చిన్న క్యాడర్‌ ఉద్యోగులకు ఇప్పటి వరకూ గ్రేడ్‌ ఫిక్సేషన్‌ చేయలేదు. దీంతో, సంబంధిత ఉద్యోగులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

వీరి పరిస్థితి మరీ దారుణం

ఇక ఫీల్డ్‌ అసిస్టెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వహిస్తూ, ఉపాధి కూలీలతో పనులు చేయించడంలో వీరిది కీలక పాత్ర. అటువంటి వీరు నెలకు రూ.10 వేలు ఫిక్స్‌డ్‌ వేతనంతో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వీరి వేతనం రూ.1,200తో ప్రారంభమై, ప్రస్తుతం రూ.10 వేలకు చేరింది. అయితే, బేసిక్‌ వేతనం రూ.5,740 మాత్రమే లభిస్తోంది. మిగిలిన మొత్తం ఇతర అలవెన్సులుగా చెల్లిస్తున్నారు. వేతన శ్రామికులకు 7,500కు పైగా పని దినాలు కల్పించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు బేసిక్‌ వేతనంతో కలిపి రూ.9,300 వస్తుంది. 15 వేల పనిదినాలు కల్పిస్తే గౌరవ వేతనంతో కలిపి రూ.12 వేలు వస్తుంది. ప్రస్తుతం ఉన్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని ఫీల్డ్‌ అసిస్టెంట్లు వాపోతున్నారు. వేతనాలు పెంచాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

ఇవీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల డిమాండ్లు

చట్ట ప్రకారం రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి.

అక్రమ తొలగింపులు, బెదిరింపులు ఆపాలి.

ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించకుండా పై అధికారులకు మాదిరిగానే ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీ(ఎఫ్‌టీఈ )గా గుర్తించాలి.

ఉద్యోగ భద్రత కల్పించి, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి.

వేతన శ్రమ జీవులకు పనిదినాలు కల్పించే టార్గెట్‌ బేస్డ్‌ విధానం వలన అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అభద్రతా భావానికి గురి చేస్తున్న ఈ విధానాన్ని రద్దు చేయాలి.

నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎంఎంఎస్‌)లో సాంకేతిక లోపాలను సరి చేయాలి.

కనీస వేతనం చెల్లించాలి

వీబీ జీ రామ్‌ జీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల పైనే క్షేత్ర స్థాయిలో బాధ్యత అధికంగా ఉంటుంది. 2007 నుంచి నేటి వరకూ వీరికి కనీస వేతన చట్టాన్ని వర్తింపజేయకపోవడం దారుణం. ఉద్యోగ భద్రత లేని విధుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పని చేస్తున్నారు.

– మేడిది పరంధామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,

ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ (సీఐటీయూ), అమలాపురం

హామీ నిలుపుకోవాలి

ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కోడ్‌ రాక ముందే ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి. లేకుంటే అన్ని సంఘాలనూ కలుపుకొని సమ్మె చేసేందుకు సిద్ధమవుతాం.

– కోడెల ప్రకాష్‌, ఏపీ గ్రామీణ

ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ (సీఐటీయూ) తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement