సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సర్వ మానవ మహోపకారి, దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలో వేలాదిగా ముస్లింలు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని సున్నీ మసీదుల ఇమామ్‌లు, కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖుల ఆధ్వర్యాన ఆజాద్ చౌక్ సెంటర్ నుంచి అప్సర థియేటర్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్డు, పుష్కర ఘాట్, దేవీచౌక్, కంబాల చెరువు, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా దానవాయిపేట మసీదు వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన విందులో సుమారు 3 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. దారి పొడవునా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను వినిపిస్తూ, ధార్మిక నినాదాలు చేస్తూ ఆద్యంతం ఆహ్లాదకరంగా ముందుకు నడిచారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మించి 1,500 సంవత్సరాలు దాటిందన్నారు. ఆయన చెప్పిన ప్రవచనాలు, చూపిన ఆచరణలు ఇప్పుడున్న వారికే కాక భవిష్యత్తు మానవాళికి మార్గదర్శకమని అన్నారు. కార్యక్రమంలో రాయల్ మసీద్ ఇమామ్ అబ్దుల్ హఫీజ్ ఖాన్, లాల్ ఖాన్, డిల్లు, మల్లయ్యపేట మసీద్ అధ్యక్షులు బషీర్ భాయ్, రబ్బాని, మొహమ్మద్ షబ్బీర్, మొహమ్మద్ బషీర్ తదితరులు పాల్గొన్నారు.


