ఎన్నాళ్లీ కుట్టుకథలు! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ కుట్టుకథలు!

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

జిల్లాలో కుట్టు, అల్లికల శిక్షణకు

12 వేల మంది దరఖాస్తు

వారిలో సుమారు 3 వేల

మందికి శిక్షణ పూర్తి

ఏడాదవుతున్నా కుట్టు మెషీన్లు

ఇవ్వని సర్కారు

3,593 యూనిట్లకు

రూ.7.58 కోట్ల కేటాయింపు

స్వయం ఉపాధి కోసం ఆశగా

మహిళల నిరీక్షణ

సాక్షి, రాజమహేంద్రవరం: సొంత కాళ్లపై నిలబడాలనే ఆశతో.. స్వయం ఉపాధి పొంది కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో ముందడుగు వేసిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. కుట్టు, అల్లికల్లో ఉచితంగా శిక్షణ, అనంతరం ఉచితంగా కుట్టు మెషీన్లు ఇస్తామని గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ, జిల్లాలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఏడాదవుతున్నా ఇస్తామన్న కుట్టు మెషీన్లు, సర్టిఫికెట్లను ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వడం లేదు. దీంతో, స్వయం ఉపాధి దూరమై ఆ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కేటాయింపులు కాగితాలకే పరిమితమా?

జిల్లాలోని బీసీ, కాపు, ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్‌) వర్గాల మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో శ్రీకారం చుట్టింది. జిల్లాకు 3,593 యూనిట్లు కేటాయించింది. దీనికి అవసరమైన నిధులు రూ.7.58 కోట్లు కూడా కేటాయించింది. ఈ నిధులను ఒక్కొక్కరికి రూ.21,798 వంతున ఖర్చు చేయాలని భావించారు. ఆ మొత్తంలో శిక్షణకు రూ.15,559, మిగిలిన రూ.6,199తో కుట్టు మెషీన్లు అందించాలని నిర్ణయించారు. శిక్షణలో 75 శాతం హాజరు ఉన్నవారికి ఉచితంగా కుట్టు మెషీన్లు ఇస్తామని ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణకు 12,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి మొత్తం 25 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. వీరిలో 2,904 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం, అవసరమైన పరీక్ష కూడా రాశారు. అంతే.. అక్కడితో తమకు సంబంధం లేనట్లు ప్రభుత్వం, బీసీ కార్పొరేషన్‌ అధికారులు మిన్నకుండిపోయారు. తమకు ఇస్తామన్న సర్టిఫికెట్లు, ఉచిత కుట్టు మెషీన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఆ మహిళలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం గొప్పగా చేసిన కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వాపోతున్నారు. అసలు నిధులు పూర్తిగా మంజూరయ్యాయా.. మంజూరైతే మెషీన్లు ఎందుకు పంపిణీ చేయడం లేదో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇదే విషయం అధికారుల వద్ద ప్రస్తావిస్తే సమాధానం దాటవేస్తున్నారు.

సర్టిఫికెట్లు లేక.. రుణాలు అందక..

ఇటు మెషీన్లు రాకపోగా, అటు సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను మరింత నిరాశకు గురిచేస్తోంది. శిక్షణ పొందినట్లు ధ్రువీకరణ పత్రం ఉంటే ఇతరత్రా అవకాశాలను కూడా వినియోగించుకునే వారమని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం ఇప్పిస్తామంటూ అధికారులు చెప్పిన మాట కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు. పోనీ, సొంతంగా రుణాలకు దరఖాస్తు చేసుకుందామన్నా సర్టిఫికెట్లు కూడా అందక ఇబ్బందిగా ఉందని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్దే ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో కుట్టు, అల్లికల శిక్షణ పూర్తి చేసుకున్నామని.. సొంతంగా కుట్టు మెషీన్‌ కొనుగోలు చేసే స్తోమత లేక ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. వెంటనే అందరికీ సర్టిఫికెట్లతో పాటు కుట్టు మెషీన్లు కూడా అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో కుట్టు శిక్షణ తీరిదీ...

మహిళల మంజూరైన వచ్చిన శిక్షణ పూర్తి

కేటగిరీ యూనిట్లు దరఖాస్తులు చేసుకున్న వారు

బీసీ 1,456 7,392 1,615

కాపు 802 3,839 951

ఈడబ్ల్యూఎస్‌ 1,335 887 338

మొత్తం 3,593 12,118 2,904

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement