సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఏటా ప్రమాదాలు పెరుగుతున్నా కొంత మంది వాహనదారుల తీరు మాత్రం మారడం లేదు. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలతో పాటు జాతీయ రహదారిని ఆనుకుని మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సాయంత్రం మొదలుకొని రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, బార్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. పూటుగా మద్యం తాగి, వాహనాలు నడుపుతున్న కొందరు తమతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మద్యం మత్తులో వాహనాన్ని అదుపులో ఉంచలేకపోవడం, అతి వేగంగా నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ ప్రమాదాలకు అతి వేగం ప్రధాన కారణమైతే... దాని వెనుక మద్యం మత్తు కూడా ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఇటీవల రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొని వైద్య విద్యార్థిని ప్రియాంక మరణానికి కారకులయ్యారు. వారు సైతం ఆ సమయంలో మద్యం మత్తులో ఉండటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా మద్యం తాగి రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తనిఖీలు పెంచాల్సిందే..
మద్యం మత్తులో వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కీలక ప్రాంతాలు, ప్రధాన రహదారులు, రాజమహేంద్రవరం నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు క్రమం తప్పకుండా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించినా అవి తూతూమంత్రంగానే సాగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, బార్లు ఉన్న ప్రాంతాలతో పాటు నగర శివారు రహదారులు, జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా మీదుగా సాగే జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లాలోని రాజానగరం నుంచి దేవరపల్లి మధ్య జాతీయ రహదారిపై అత్యధికంగా 46 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. ఈ నేపథ్యంలో హైవేకి ఇరువైపులా, దీనికి అనుసంధానమయ్యే రోడ్ల వద్ద మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, నిబంధనల ప్రకారం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అనే నినాదం కేవలం పోలీసులు నిర్వహించే తనిఖీల వరకే పరిమితం కాకుండా.. ప్రతి వాహనదారుడి బాధ్యతగా మారాలి. లేదంటే తూలుతూ.. తోలుతూ.. సాగుతున్న ఈ ప్రయాణాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది.
తనిఖీలు ముమ్మరం చేస్తాం
జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తాం. తనిఖీల్లో పట్టుబడిన ఎవ్వరినీ వదలడం లేదు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్షలు పడేలా కేసులు నమోదు చేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకూ 43 మందిని జైలుకు పంపాం. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే నష్టాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.
– శ్రీకాంత్, ట్రాఫిక్ డీఎస్పీ, రాజమహేంద్రవరం
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులిలా..
సంవత్సరం కేసులు జరిమానా
2024 494 రూ.27.5 లక్షలు
2025 1,596 రూ.1.09 కోట్లు
2026 569 రూ.44.1 లక్షలు
బహిరంగ మద్యపానంపై
కేసుల వివరాలు
సంవత్సరం కేసులు
2024 8,235
2025 13,136
2026 8,107
మద్యం మత్తులోనే రోడ్ల పైకి వాహనదారులు
ఏటా ప్రమాదాలు
పెరుగుతున్నా మారని తీరు
జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు


