సముద్రంలోకి 4.63 లక్షల
క్యూసెక్కుల విడుదల
ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి బుధవారం క్రమేపీ పెరుగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మిగులు జలాల విడుదలను పెంచారు. బుధవారం రాత్రి బ్యారేజీ నుంచి 4,63,583 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉపనదులైన ఇంద్రావతి, శబరి నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే, తాలిపేరు నుంచి వరద నీరు దిగువకు రావడంతో బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి నీటి ఉధృతి పెరిగింది. గురువారం సాయంత్రం వరకూ నీటి ఉధృతి పెరిగి అనంతరం, తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.80 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నమోదైంది.
ప్రియాంక కేసులో ఫోరెన్సిక్
బృందం పరిశీలన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. దీనిలో భాగంగా విజయవాడ నుంచి ముగ్గురితో కూడిన ఫోరెన్సిక్ బృందం రాజమహేంద్రవరం వచ్చింది. ప్రియాంక మృతి ఘటనకు సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాలన్నింటినీ పరిశీలించింది. సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఘటన జరిగిన ప్రసాదిత్య మాల్ వద్దకు వెళ్లి, కేసులో సూచించిన ప్రాంతం, జరిగిన సంఘటనకు సంబంధించి ఆనవాళ్లను పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన కారును కూడా పరిశీలించారు. ఈ కేసులో పొందుపర్చిన ప్రాంతాలను ఫోరెన్సిక్ బృందం మంగళ, బుధవారాల్లో పరిశీలించి, వెళ్లింది. దీనిపై నివేదికను పోలీసు శాఖ ఉన్నతాధికారులకు అందజేయనుంది.
సమన్వయంతోనే
సాధిక్ అరెస్టు
కాకినాడ క్రైం: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో ముప్పుతిప్పలు పెట్టిన నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. పోలీసుల చేజింగ్ తీరు థ్రిల్లర్ చిత్రాన్ని తలపించింది. ఇందులో పోలీసుల నెట్‌వర్కింగ్‌తో సహా వారి సమన్వయం ఔరా అనిపించింది. నిందితుడి కోసం సుమారు 70 మంది పోలీసులు ఐదు రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంటే చివరకు మహారాష్ట్రలో గుర్తించారు. సరిగ్గా అక్కడ గస్తీ కాస్తున్న జిల్లా, స్థానిక పోలీసులు సమీపించేసరికి ఒకేచోట ఉండడం సేఫ్ కాదని భావించిన సాధిక్ అక్కడి నుంచి మీరట్‌కు పయనమయ్యాడు. అక్కడి నుంచి అతడు కేరళ పారిపోయే యోచనలో ఉన్నాడని ఎస్పీ బిందుమాధవ్‌కు అధికారులు వివరించారు. దీంతో, సాధిక్‌ను అరెస్టు చేసి తీసుకు రావాలంటూ తుని రూరల్ సీఐ గీతా రామకృష్ణ, ఇంద్రపాలెం ఎస్సై ఎం.వీరబాబు, కానిస్టేబుల్ మొయిన్‌లను ఎస్పీ ఆదేశించి విమానంలో పంపించారు. వారు సాధిక్ స్నేహితుడు అబ్బాస్ ఇంటి వద్దకు వెళ్లి కాపు కాయగా అక్కడ నిందితుడు పట్టుబడ్డాడు. విమానంలో వెళ్లకపోయి ఉంటే సాధిక్ కేరళ పరారయ్యేవాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
‘గొడవ రెండు కుటుంబాలది,
రెండు మతాలది కాదు’
సీనియర్ న్యాయవాది జవహర్ అలీ
కాకినాడ క్రైం: సాధిక్ ఘటన రెండు కుటుంబాలకు చెందినదే తప్ప రెండు మతాలది కాదని కాకినాడకు చెందిన సీనియర్ న్యాయవాది జవహర్ అలీ అన్నారు. కుటుంబ సభ్యులు కేసు చేయమని కోరారని, తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ములాఖత్‌తో సాధిక్‌ను కలిసింది తానేనని, కేసు నేనే చేస్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని, తానింకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సౌజన్యతో కలిసి ఆమె భర్తను హతమార్చడంలో భాగస్వామి కావడం, నలుగురు కుటుంబసభ్యుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పడం అనే అభియోగాలు సాధిక్‌పై ఉన్నాయన్నారు. న్యాయవాదులు ఎవరూ సాధిక్ తరఫున వాదించొద్దన్న ఎంపి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అలీ తెలిపారు. ఓ కేసు చేయాలా వద్దా అన్నది న్యాయవాది ఇష్టమని జవహర్ అలీ స్పష్టం చేశారు.


