కపిలేశ్వరపురం: సంస్కృతి, సంప్రదాయ, సాహితీ రాజధానిగా పేరొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు సైతం ఎంతో స్ఫూర్తినిచ్చింది. మహాత్మా గాంధీ ఈ ప్రాంతంలో వేసిన ప్రతి అడుగూ చైతన్యాన్ని నింపినదే. 1919లో ఖిలాఫత్ పోరాటం, జలియన్ వాలాబాగ్ హత్యలు, యువతలో సాయుధ పోరాట మార్గాల తీరుతెన్నులను ఆనాటి సాహిత్యకారులు తమ రచనలతో మేల్కొల్పారు. గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ‘మాకొద్దీ తెల్లదొర తనం’ గేయం విశేషంగా ప్రభావం చూపింది. పిఠాపురానికి చెందిన ఆచంట సత్యనారాయణ జాతీయ గీతాలను సేకరించి ముద్రించగా వాటిని బ్రిటీషు ప్రభుత్వం నిషేధించి, రాజద్రోహం కేసు పెట్టి రెండున్నరేళ్లు జైలులో ఉంచారు. తునికి చెందిన కొండపల్లి జగన్నాథదాస్ పంతులు గాంధీ హరికథ, స్వరాజ్య బొబ్బిలి పదం, స్వారాజ్య తాంబూలం తదితర పాటలు రచించి స్వయంగా పాడినందుకు మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు.
ఎందరో వీరులు
రామచంద్రపురానికి చెందిన డాక్టర్ చెలికాని వెంకట రామారావు తండ్రి రామస్వామి నాయుడు కందుకూరి వీరేశలింగం అనుచరుడు. ఆయన పోరాటాలను కట్టడి చేసేందుకు బ్రిటీషు ప్రభుత్వం 1932లో ఆయనను బళ్లారి జైలులో పెట్టింది. అనంతరం 1939 లోనూ కాకినాడలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1952 తొలి పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.
చేనేత ఉద్యమం
ఉప్పాడ, కొత్తపల్లి, అంబాజీపేట, తుని, రాజమహేంద్రవరం, పెద్దాపురం, మండపేట, పిఠాపురం, గొల్లప్రోలు, రాజోలు, ద్రాక్షారామలలోని చేనేత వృత్తిదారుల ఉద్యమం చెప్పుకోదగినది. యుద్ధ ప్రభావంతో నూలు సరఫరా నిలచిపోయి ఆ వృత్తి కరువు కోరల్లో చిక్కుకుంది. దీంతో పుత్సల సత్యనారాయణ, ఇనుమర్తి వీరభద్రరావు, కర్రా మావుళ్లయ్య, బొమ్మన బసవరాజు, చంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది.
సీతానగరం ఆశ్రమం
సీతానగరం: గ్రామంలోని కస్తూర్బా ఆశ్రమాన్ని మహాత్మాగాంధీ రెండుసార్లు సందర్శించారు. 1920లో బాపూజీ సహాయ నిరాకరణోద్యమం ప్రకటించి దేశ నలుమూలలా తిరిగి ఉద్యమ ప్రాముఖ్యత, ఆవశ్యకత, శాంతియుత విధానాలను తెలియజేశారు. ఆయన పిలుపునందుకుని వైద్యులు బ్రహ్మజోష్యుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అల్యూమినియమ్ వ్యాపారి జీవన్‌లాల్ ఆర్థిక సాయంతో 1924 నవంబర్ 9న సీతానగరంలో గౌతమీ సత్యాగ్రహాశ్రమం స్థాపించారు. 1925 ఫిబ్రవరి 4న గృహ ప్రవేశం మహోత్సవం జరిపారు. మహాత్మగాంధీ సీతానగరం ఆశ్రమానికి 1929 మే 8, 9లో తొలిసారిగా వచ్చారు. అలాగే హరిజనోద్ధారణ యాత్రలో భాగంగా 1933 డిసెంబర్‌లో ఈ ఆశ్రమానికి వచ్చి, ఆశ్రమవాసులను ఉత్తేజపర్చారు. ఇక్కడి రాట్నంపై నూలు వడికారు. సతీ సమేతంగా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. అప్పటి నుంచి గౌతమి సత్యాగ్రహాశ్రమం కాస్తా కస్తూర్బాగాంధీ ఆశ్రమంగా పేరొందింది.
నాగుల్లంకలో స్వాతంత్య్ర
సమరయోధుల స్మారక స్థూపం
ఉద్యమాల పురిటిగడ్డ నాగుల్లంక
పి.గన్నవరం: స్వాతంత్య్ర సంగ్రామంలో పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ గ్రామం నుంచి 22 మంది పోరాట యోధులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు తామ్రపత్ర అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఆరుమిల్లి వెంకటరత్నం, ఆరుమిల్లి విశ్వేశ్వరరావు, ఆరుమిల్లి సుబ్బారావు, అడబాల నర్శింహమూర్తి, గ్రంధి సూరన్న, ఆరుమిల్లి చౌదరి, ఆరుమిల్లి తాతయ్య, బద్దే ప్రకాశరావు, గ్రంధి రామమూర్తి, గ్రంధి మూలాస్వామి, గ్రంధి సత్యం, కడలి పద్దయ్య, శ్రీఘాకోళపు వీరరాఘవులు, వలవల వీరన్న, ముద్దా పెరుమాళ్ల స్వామి, చిట్టినీటి మంగయ్యనాయుడు, ఆరుమిల్లి వెంకన్న, మీనవల్లి వెంకటరత్నం, చెన్ను ముత్యం, ఆకుల రఘుపతి, అద్దేపల్లి నర్శింహమూర్తి, గద్దే లచ్చన్నలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా 2002లో అప్పటి ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా నాగుల్లంక సెంటర్‌లో స్వాతంత్య్ర సమర యోధుల స్మారక స్థూపాన్ని నిర్మించి, ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర పోరాటంలో
ఉమ్మడి జిల్లా పాత్ర ఎనలేనిది
కలంతో కదనమాడిన ధీరులెందరో
జిల్లాలో గాంధీజీ
ప్రతి అడుగూ చరిత్రాత్మకం
నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..


