రాజమహేంద్రవరం సిటీ: ప్రమాదంలో గాయపడి విజయభారతి చెస్ట్ కేర్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావును శుక్రవారం పలువురు పరామర్శించారు. మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కురసాల కన్నబాబు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీలు మార్గాని భరత్ రామ్, చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, నాగులాపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీ దాట్ల ఫృథ్వీ, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకటరావు తదితరులు ఉన్నారు.
అడవుల విస్తీర్ణం పెరగాలి
రాజానగరం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం మరింత పెరగాలని, ఆ మేరకు శాఖా పరంగా కృషి జరుగుతోందని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, అటవీ దళాధిపతి, ముఖ్య వన్యప్రాణి సంరక్షణాధికారి పీవీ చలపతిరావు అన్నారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఆకుపచ్చదనంతో ఉండే ప్రాంతం 30 శాతం మాత్రమేనని, దాన్ని 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దివాన్ చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్టులో నగర వనంగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ ప్రాంతంలో రుద్రాక్ష, ఎర్రచందనం, శ్రీగంధం, దాల్చిన చెక్క, రోజ్‌వుడ్, మామిడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీీసీఎఫ్ ఎన్.నాగేశ్వరరావు, టి.జ్యోతి, డీఎఫ్‌ఓ వి.ప్రభాకరరావు, డీఆర్వో ఎం.సోమరాజు పాల్గొన్నారు.
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఏడాది జైలు
కాకినాడ లీగల్: కాకినాడ దేవాలయం వీధిలోని తనిష్క్ జ్యుయలర్స్‌లో సేల్స్‌మన్‌ను తుపాకీతో బెదిరించి బంగారం చోరీ చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ డి.శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన నూకల సతీష్ 2004 డిసెంబర్ 18న కాకినాడ దేవాలయం వీధిలోని తనిష్క్ జ్యుయలర్స్‌కు వెళ్లాడు. అక్కడి సేల్స్‌మన్ గంటశాల సుబ్రహ్మణ్యాన్ని బంగారు గొలుసులు, నాణేలు చూపించాలని కోరాడు. బంగారు ఆభరణాలు చూ పుతున్న సమయంలో సతీష్ తుపాకీ చూపించి బెదిరించి, 39 గ్రాముల విలువైన సుమారు రూ.1.95 లక్షల ఆభరణాలను అపహరించి పరారయ్యాడు. వెంటనే షాపు సిబ్బంది సతీష్‌ను వెంబడించి కాకినాడ ఫారెస్ట్ కార్యాలయం వద్ద పట్టుకున్నారు. కోర్టు విచారణలో నూకల సతీష్‌పై నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
నగదు చోరీ చేసిన కేసులో.. కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన కాకర లోవరాజు గత ఏడాది డిసెంబర్ 22న గంజాం వారి వీధిలోని అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణం తాళాలు బద్దలు కొట్టి సుమారు రూ.20 లక్షల నగదును చోరీ చేశాడు. దీనిపై దుకాణ యజయాని హితేష్ రాజ్ పురోహిత్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో లోవరాజుపై నేరం రుజువు కావడంతో పై విధంగా న్యాయమూర్తి డి.శ్రీదేవి తీర్పు చెప్పారు.


