బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గాంధీ 1921–28 ప్రాంతాల్లో కాకినాడను సందర్శించారు. 1923 ప్రాంతంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో కాకినాడ గాంధీపార్కులో ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ తొలి మహాసభ ఇక్కడే నిర్వహించారు. గాంధీజీ కాకినాడ వచ్చిన సమయంలో పైడా వెంకట నారాయణ, వేళంగి సుబ్బారావు ఇళ్లల్లో ఆతిథ్యం స్వీకరించారు. ఆయన 1921, 1929ల్లో ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ ముగింపోత్సవాలకు హాజరయ్యారు. ప్రస్తుతం గాంధీ మందిరంగా ఉన్న ఈ పార్కును శఠగోపాలాచార్యులు, తనికెళ్ల సత్యనారాయణ కొనుగోలు చేశారు. మహాత్మగాంధీ జననం నుంచి మరణం వరకు ఉండే అనేక ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను సేకరించి ఇక్కడ పొందుపరిచారు. దీనిని 1950లో ప్రారంభించారు. గాంధీ నగర్‌లోని ఓ పార్కుకు ఆయన పేరు పెట్టారు.


