రంగంపేట: షార్ట్ సర్క్యూట్‌తో పాన్‌షాప్ దగ్ధమై, దానిలోని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన శుక్రవారం ఏడీబీ రోడ్డులో రంగంపేట వద్ద జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదరాయవరం గ్రామానికి చెందిన పెంటా ప్రసాద్ ఏడీబీ రోడ్డును ఆనుకుని చెక్క బడ్డీలో పాన్‌షాపు నడుపుతున్నారు. అక్కడే టీ కూడా విక్రయిస్తుంటాడు. అయితే శుక్రవారం చెక్క బడ్టీకి నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఆ వేడికి బడ్టీలో ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో బడ్డీలోని ఫ్రిజ్, స్టౌ, కూలర్ తదితర వస్తువులన్నీ కాలిబూడిదగా మారాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా.


