● వేర్వేరు ప్రమాదాల్లో
ఇద్దరు విద్యార్థుల మృతి
● దివాన్ చెరువు,
అనాతవరంలో ఘటనలు
రాజానగరం/ముమ్మిడివరం: బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్న ఆ ఇద్దరు విద్యార్థులు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అందనంత దూరానికి వెళ్లిపోయి తల్లితండ్రులకు తీరని శోకం మిగిల్చారు. వివర్లాలోకి వెళితే.. జాతీయ రహదారిపై దివాన్ చెరువు కూడలిలో గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం అడవిపాలేనికి చెందిన రాపాక నవీన్ (22), హైదరాబాద్‌లోని ఉప్పల్‌కుచెందిన దాసరి వివేక్ (22) రాజానగరం సమీపంలోని గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. దివాన్ చెరువులోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ రోజూ కళాశాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధర్రాతి వీరిద్దరూ మోటారు సైకిల్‌పై బయటకు వెళ్లి శ్రీరామపురం రోడ్డులో ఉన్న హాస్టల్‌కి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో దివాన్ చెరువు కూడలిలో రాజానగరం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరినీ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. వివేక్ కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
ఆసరా అవుతాడనుకుంటే..
మృతుడు రాపాక నవీన్ తండ్రి శ్రీనివాసరావు కష్టజీవి, తల్లి గల్ఫలో ఉంటూ కొడుకు చదువుకు సాయమందిస్తోంది. ఈ క్రమంలో బీటెక్ ఫైనలియర్‌కి వచ్చిన కొడుకు రేపో మాపో తమ కుటుంబానికి ఆసరా అవుతాడని భావించిన ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీరని చిచ్చు రేపింది.
కారు అదుపు తప్పి..
ముమ్మిడివరం మండలం అనాతవరం సెంటర్‌లోని వాటర్ ప్లాంట్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన అల్లం జయసూర్య (30) అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం స్నేహితుడు కేతావత్ ఆకాష్‌తో కలిసి కారులో అమలాపురం నుంచి కాకినాడ వైపు బయలు దేరాడు. అనాతవరం సెంటర్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయసూర్యను స్థానికులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయసూర్య తల్లిదండ్రులు అనంతలక్ష్మి, లీలా కృష్ణమూర్తిలకు ఇద్దరు కుమారులు కాగా జయసూర్య పెద్ద కుమారుడు. అతడు తన తల్లితో పాటు కిమ్స్ సమీపంలోని భద్రకాళీ లేఅవుట్‌లో ఆద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తల్లి అనంతలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


