చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. జిల్లాలోని నిరుద్యోగులకు సుమారు రూ.2,150 కోట్ల భృతి బాకీ ఉన్నారు. ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని మాయ మాటలు చెప్పి ఆడబిడ్డలను దగా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలివ్వకపోవడంతో పేద, బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు ఉసూరుమంటున్నారు. ప్రస్తుతం ప్రజలంతా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్ సీపీ అభ్యుర్థులే విజయం సాధిస్తారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆ దిశగా ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తుండడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. గ్రామ పంచాయతీల పాలకవర్గం ఏప్రిల్ 4తో ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబర్ 25తో ముగియనుంది. మరోవైపు జిల్లాలోని మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలమూ ముగిసిపోయింది. ఇక రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో తేలేలా లేదు. విలీన ప్రాంతాల వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో ఆ సమస్య పరిష్కారమైతేనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.
కొత్త ఓటర్ల జాబితాతో..
రాష్ట్రంలో ప్రస్తుతం సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడంతో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారం పూర్తయ్యాక అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఆ జాబితా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పంచాయతీల్లో వార్డుల విభజన, జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలను పంచాయతీలతో మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను విభజించి కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు పాత భౌగోళిక స్వరూపంతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. విలీన ప్రాంతాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం కోర్టు కేసులను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
ప్రజా ఉద్యమాలతో వైఎస్సార్ సీపీలో జోష్
బూటకపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సంక్షేమ పథకాల అమలులో విఫలమవడంతోపాటు అభివృద్ధి కూడా మందగించింది. మరోవైపు అన్ని రంగాల్లోనూ అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై వారి గొంతుకై రెండేళ్లుగా వైఎస్సార్ సీపీ పోరాడుతూ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూ పథకాల అమలుకు ఒత్తిడి తీసుకు వస్తోంది. ముఖ్యంగా మద్దతు ధర దక్కక నష్టాలపాలవుతున్న అన్నదాతలు.. డీఎస్సీ స్కామ్‌తో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన బాధితుల తరఫున ఇటీవల చేసిన పోరాటాలు విజయవంతమయ్యాయి. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మంచి ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ప్రజల్లోనూ పార్టీకి ఆదరణ విపరీతంగా పెరిగింది. అందరికీ మంచి చేసిన వైఎస్ జగన్‌ను దూరం చేసుకున్నామనే భావన అన్ని వర్గాల్లోనూ వినిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, కూటమి పార్టీల మధ్య విభేదాలతో ఆయా పార్టీల శ్రేణులు నిస్తేజంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్సార్ సీపీ కచ్చితంగా పైచేయి సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తూర్పు గోదావరిలో పరిస్థితి ఇదీ..
పంచాయతీలు 342
ఎంపీటీసీ స్థానాలు 390
జెడ్పీటీసీ స్థానాలు 21
మున్సిపాలిటీలు 03
నగరపాలక సంస్థ 01
మొత్తం ఓటర్లు 16,65,712
పోలింగ్ కేంద్రాలు 2,038
ఇప్పటికే ముగిసిన పంచాయతీ
పాలకవర్గాల పదవీకాలం
కొద్ది రోజుల్లో ముగియనున్న
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవులు
ప్రత్యేకాధికారుల పాలనలో
3 మున్సిపాలిటీలు,
రాజమహేంద్రవరం కార్పొరేషన్
ఎన్నికల సంఘం
ప్రకటనలతో రాజకీయ సందడి


