లెఫ్టయినా రైటే | - | Sakshi
Sakshi News home page

లెఫ్టయినా రైటే

Aug 13 2026 12:15 AM | Updated on Aug 13 2026 12:15 AM

కొందరికి పుట్టుకతోనే ఎడమచేతి వాటం

వారికి అన్ని రంగాల్లో సామర్థ్యం

ప్రత్యేక ప్రతిభతో సత్తా చాటుతున్న వైనం

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

కపిలేశ్వరపురం/రాయవరం: సాధారణంగా సమాజంలోని ప్రతి వ్యక్తి ప్రత్యేక భిన్నమైన గుణం కలిగి ఉంటారు. అయితే కొందరిలో వారి ప్రత్యేకతను బట్టి ఇట్టే గుర్తుపట్టొచ్చు. అందులో లెఫ్ట్‌ హ్యాండర్స్‌కూ డా ఉంటారు. ప్రతి వందమందిలో 90 శాతం కుడిచేతి వాటం వారు ఉండగా, మిగతా 10శాతం మంది లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కనిపిస్తుంటారు.

లెఫ్ట్‌ హ్యాండర్స్‌డే ప్రాధాన్యం ఇదీ..

అంతర్జాతీయంగా ఉన్న ఎడమ చేతి వాటం గల వారు 1976 ఆగస్టు 13న సమావేశమై అనేక అంశాల మీద చర్చించారు. ఆ సమావేశ తేదీనే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. కుడి చేతి రాత గల వారి ఆదిపత్యం గల సమాజంలో ఎడమ చేతి వాటం గలవారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం చేయాలనుకున్నారు. ప్రపంచంలో దాదాపు 90 శాతం మందికి కుడి చేతిని ఉపయోగించి పనులు చేస్తారని సర్వేల్లో వెల్లడైంది. 10 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. అయితే ప్రతిభ, సజనాత్మకత, ఏ రంగంలోనైనా రాణించే శక్తి సామర్థ్యాలు ఎడమ చేతి వాటం వారిలోనే ఎక్కువని చెబుతుంటారు.

ఎందరో ప్రముఖులు

ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్‌, చంద్రుడిపై మొట్టమొదట కాలుమోపిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మోనాలిసా సృష్టికర్త లియోనార్డ్‌ డావెన్సీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఇండియా ప్రధాని నరేంద్రమోదీ, వ్యాపారవేత్త రతన్‌టాటా ఇలా చెప్పుకుంటూ పోతే ఎడమచేతి వాటం ప్రముఖులు చాలామంది ఉన్నారు.

ఇబ్బందులూ ఉన్నాయి

ఎడమచేతి వాడకంపై లాభనష్టాలు, ఇబ్బందుల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమచేతి వాటం ఉన్న వారు ఎంతో అదృష్టవంతులని కొందరు అంటారు. అటువంటి వారు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగారని చెబుతారు. అయితే శుభకారార్యాల్లో ఎడమ చేతి వినియోగాన్ని మన సంప్రదాయాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భాల్లో ఆ అలవాటు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు పాఠశాలల్లో విద్యార్థులు కూర్చునే కుర్చీలకు కుడిచేతివైపు రాయడానికి వీలుగా అట్ట అమరుస్తారు. అలాగే డ్రైవర్లకు కుడిచేతి వాటానికి అనుకూలంగా హారన్‌ మొదలైనవి ఉంటాయి.

మాన్పించొద్దు

ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పటి నుంచి పిల్లలు వస్తువులను పట్టుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేతి వాటాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నిస్తారు. అలా చేయడం వలన ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మంచే జరిగింది

చిన్నప్పుడు ఎడమ చేతితో రాయడం ప్రారంభించాను. కొందరు వద్దన్నా అలాగే కొనసాగించాను. దానివల్ల ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. అన్ని అంశాల్లోనూ మంచే జరిగింది.

– బక్కి సుధాకర్‌, అధ్యాపకుడు, కాలేరు, కపిలేశ్వరపురం

జన్యు ప్రభావంతోనే..

ఎడమ చేతి వాటం వల్ల పిల్లలకు ఏ విషయంలోను ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఈ అలవాటును తల్లిదండ్రులు మాన్పించే ప్రయత్నం చేయకూడదు.

– వి.అనిరుధ్‌, వైద్యాధికారి, పీహెచ్‌సీ, రాయవరం

లెఫ్ట్‌ హ్యాండ్‌ రెడ్డిగా మారాను

నేను బౌలింగ్‌, బ్యాటింగ్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌తోనే చేస్తాను. అందుకే లెఫ్ట్‌ హ్యాండ్‌ నా ఇంటిపేరుగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ లెఫ్ట్‌ హ్యాండ్‌ వెంకటరెడ్డి అనే పిలుస్తారు.

– మల్లిడి వెంకటరెడ్డి, రాయవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement