● నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం
● నెల రోజుల పాటు విశేష పూజలు, వ్రతాలు
● భారీగా జరగనున్న వివాహాలు
భారీగా వివాహాలు
వివాహాది శుభకార్యాలు జరుపుకోవడానికి శ్రావణం మంచి మాసం. ఈ నెలలో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. ఆ మేరకు పెళ్లివారు ముందుగానే ముహూర్తాలు పెట్టించుకుని ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు.
– బిక్కవోలు అనంత లక్ష్మణకుమారాచార్యులు,
వేదపండితుడు, కొత్తపేట
భక్తులకు ఏర్పాట్లు
పాదగయ క్షేత్రంలో కొలువైన పురూహూతికా అమ్మవారికి శ్రావణంలో ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం. భక్తుల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఆలయ మండపాల్లో వరలక్ష్మీ వ్రతాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
– కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్,
ఆలయ ఈఓ పాదగయ క్షేత్రం, పిఠాపురం
కొత్తపేట/పిఠాపురం: శుభ శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. వరలక్ష్మీ వ్రతాలు, అమ్మవారి ఆలయాల్లో పూజలు, పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలతో అంతా సందడి ఏర్పడనుంది. ఈ మాసంలో ఐదు శుక్రవారాలు రానున్నాయి. ఇక ఈ నెల 16 నుంచి వివాహాది శుభకార్యాలు మొదలుకానున్నాయి. ఆషాఢమాసం కారణంగా జూలై 10 నుంచి 35 రోజుల పాటు శుభకార్యాలకు విరామం ఏర్పడగా, పెళ్లి బాజాలు మోగక కల్యాణ మండపాలు కళ తప్పాయి. వస్త్ర, బంగారం, వెండి ఆభరణాల దుకాణాలు వెలవెలబోయాయి. ఇప్పుడు ఆయా వ్యాపారాలు మళ్లీ పుంజుకోనున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు తమ పిల్లల వివాహాలను ఈ ముహూర్తాల్లోనే అట్టహాసంగా జరిపించాలని భావిస్తున్నారు.
ముహూర్తాలు ఇవీ..
శ్రావణమాసం మొదలైన నాలుగో రోజు నుంచి సుముహూర్తాలు మొదలు కానున్నాయి. ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30, సెప్టెంబర్ 3, 4, 5, 8, 10 వరకు సుముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అనంతరం అక్టోబరు 29 వరకు మరలా ముహూర్తాలకు బ్రేక్ పడింది. 35 రోజుల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న వస్త్ర, నగల దుకాణాలు, కల్యాణ మండపాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు సాగించే పురోహితులు, కేటరింగ్, భోజనాల తయారీ వారు, డెకరేషన్, వీడియో, ఫొటోగ్రాఫర్లు ఖాళీగా గడిపారు. శ్రావణ మాసం మొదలు కావడంతో వారికి ఊరట లభించనుంది.
ఆధ్యాత్మిక సందడి
శ్రావణ మాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకోనుంది. సోమవారాల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతాలతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


