● రామన్నపాలెంలో
గుర్తుతెలియని వ్యక్తుల దుశ్చర్య
● రూ. లక్ష విలువైన టైలరింగ్ సామగ్రి దగ్ధం
తాళ్లరేవు: పటవల పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామమైన రామన్నపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త అరదాడి దాసు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కుట్టు మెషీన్‌తో పాటు టైలరింగ్ సామగ్రి అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో అద్దెకు ఉంటున్న ఇద్దరు యువతులు నిద్రిస్తున్నారు. వారిని కూడా స్థానికులు చాకచక్యంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. దాసు వేట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలతలో చురుకుగా పనిచేస్తుంటాడు. అతడి భార్య దేవి టైలరింగ్ ద్వారా పిల్లలను చదివించుకుంటోంది. యానాంలో అమ్మవారి తీర్థం జరగడంతో పుట్టింటికి వెళ్లానని, ఆ సమయంలో ప్రమాదం జరిగిందని దేవి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో జీవనాధారం కోల్పోయానని బోరున విలపించింది. పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబానికి పొన్నాడ, పితాని పరామర్శ
వైఎస్సార్ సీపీ కార్యకర్త దాసు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, మండల అధ్యక్షుడు కాదా గోవింద కుమార్ తదితరులు పరామర్శించారు. జరిగిన విషయాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో కిటికీలోంచి పెట్రోల్ వేసి నిప్పు పెట్టి ఉంటారని దాసు తెలిపాడు. పొన్నాడ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలను చేపట్టాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు వల్లభుని దొరబాబు, కొపనాతి నాగరాజు, కాలా వెంకట రమణ, కొప్పిశెట్టి వెంకట్, కొటికెలపూడి చందు, పోల్నాటి కృష్ణ, నీలపాల శ్రీనివాస్, పినపోతు స్వామి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.


