● జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు
● ఉత్సాహంగా స్థాయీసంఘ సమావేశాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ సీజన్‌కు రైతులకు సక్రమంగా సాగునీరు విడుదల చేయాలని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీసంఘ సమావేశాలు నిర్వహించారు. వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన 3వ, మేరుగు పద్మలత అధ్యక్షతన 6వ, రొంగల పద్మావతి అధ్యక్షతన 5వ స్థాయీ సంఘ సమావేశం జరిగింది. వీటికి సంఘాల సభ్యులైన జెడ్పీటీసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులు, నాలుగు జిల్లాల్లోని వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై, అజెండాలోని ముఖ్యాంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. తొలుత జెడ్పీ చైర్మన్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షించారు. కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలను సంబంధిత అధికారులతో చర్చించారు. గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు మాట్లాడుతూ సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. వైస్ చైర్మన్ మేరుగు పద్మలత మాట్లాడుతూ తొండంగి మండలంలో రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల ప్రసవ సమయాలలో రక్తానికి కొరత లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జగ్గంపేట, రాజోలు, మామిడికుదురు, రౌతులపూడి, గంగవరం, మారేడుమిల్లి జెడ్పీటీసీలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలన్నారు. సమావేశంలో సీఈవో లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


