ఒక్క ఓటు కూడా పోకూడదు | - | Sakshi
Sakshi News home page

ఒక్క ఓటు కూడా పోకూడదు

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పని చేస్తే నాణ్యమైన, విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు మాధవీలత అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కె.మాధవీలత మొదటి పర్యటన సందర్భంగా గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. పోలింగ్‌ స్టేషన్‌ స్థాయిలో బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని, స్థానికంగా పరిష్కారం కాని ఫిర్యాదులను వాట్సాప్‌ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఏ ఓటు కూడా పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం మాత్రమే కాకుండా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ నోటీసులు నమోదైన నేపథ్యంలో కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఈఆర్‌ఓలు పరిష్కరించిన నోటీసులు, క్లెయిమ్‌లు క్వాలిటీ చెక్‌ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జేసీ మేఘస్వరూప్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ భాస్కర్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా పరిశీలకురాలు మాధవీలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement