● స్టైపెండ్ పెంపుతో పాటు
డిమాండ్ల సాధనకు పోరు
● జీజీహెచ్‌లో విధుల బహిష్కరణ
సాక్షి, రాజమహేంద్రవరం: డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు సమ్మె బాట పట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య డైరెక్టర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలకు కొంత విఘాతం కలిగే ప్రమాదం ఉంది. సుమారు 40 మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు.
పేద రోగులకు ఇబ్బందే..
సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంటామని జూడాలు తెలిపారు. అయితే ఆస్పత్రిలో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు చేయడం, పరీక్షల నిర్వహణలో పీజీ వైద్యులు, జూడాలదే కీలక పాత్ర. ప్రస్తుతం వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి జీజీహెచ్‌కు వచ్చే వేలాది రోగులు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టైపెండ్ పెంచడం లేదు
ప్రతి రెండేళ్లకు స్టైపెండ్ పెంచాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరిలోనే 30 శాతం మేర పెంచాల్సి ఉన్నా అధికారులు చర్యలు చేపట్టలేదు. వారానికి 90 గంటలకు పైగా పనిచేస్తున్నాం. అందుకు తగ్గట్టు స్టైపెండ్ పెంచడం లేదు. అందువల్లే సమ్మె చేయాల్సి వచ్చింది.
– డాక్టర్ ఏంజెల్, జీజీహెచ్
చర్చలు విఫలమవడం వల్లే..
డిమాండ్ల సాధనకు జరిపిన చర్చలు విఫలమవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చింది. అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటున్నాం. నాన్ ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే బహిష్కరిస్తున్నాం. చర్చలు ఫలించకుంటే ఆగస్టు 15 తర్వాత సమ్మె ఉధృతం చేస్తాం.
– డాక్టర్ నరేంద్ర, ప్రెసిడెంట్, జూడా అసోసియేషన్
నిబంధనలు పాటించాల్సిందే
తక్షణమే స్టైపెండ్ 30 శాతం పెంచాలి. వైద్యుల రిటైర్‌మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచకుండా 62కే కొనసాగించాలి. నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకాల్లో ఎన్‌ఎంసీ నిబంధనలను అమలు చేయాలి. ఉన్నతాధికారులతో జరిపిన చర్చల్లో 3 శాతం మాత్రమే స్టైపెండ్ పెంచుతామంటున్నారు. అందుకు తాము అంగీకరించడం లేదు. చర్చలు విఫలమైతే సమ్మె ఉధృతం చేస్తాం. – డాక్టర్ సురేష్, సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ


