కోరుకొండ: స్థానిక దోసకాయలపల్లికి చెందిన కత్తి వెంకట్ (21) మృతదేహానికి ఆధికారులు గురువారం రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జూన్ 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి వెంకట్ తీవ్రంగా గాయపడ్డాడు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ జూన్ 7న మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు దోసకాయలపల్లిలో ఖననం చేశారు. ఆ ప్రమాదంలో వెంకట్ సహచరుడు అరుణ్‌కు గాయాలు కాకపోవడం, అతడి వ్యవహార శైలిపై బాధిత కుటుంబ సభ్యులలో అనుమానాలు తలెత్తాయి. దీంతో వెంకట్ తల్లి దుర్గమ్మ ఫిర్యాదు మేరకు ఖననం చేసిన 66 రోజుల తర్వాత మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులు, కోరుకొండ తహసీల్దార్ ఎం.సుగుణ, అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యాన రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం
రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా లక్ష్మణ్
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పప్పుల లక్ష్మణ్‌ను నియమించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు పదవి లభించడంపై పలువురు అభినందనలు తెలిపారు.
మద్యం మత్తులో తల్లిపై కుమారుడి దాడి
అతడిపై ఆగ్రహంతో తండ్రి ప్రతిదాడి
దేవరపల్లి: మద్యం మత్తులో తల్లిపై కుమారుడు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా.. ఆ దారుణం చూసి తట్టుకోలేక అతడిపై తండ్రి కత్తితో ప్రతిదాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ధుమంతునిగూడేనికి చెందిన గుడ్ల గణేష్ మద్యం తాగి, ఇంటికి వచ్చి, తన తల్లి గంగారత్నంతో గొడవ పడి, ఆమె జుట్టు పట్టుకుని కొట్టాడు. అతడిని తండ్రి పోతురాజు అడ్డుకునేందుకు ప్రయ త్నించాడు. అయినా తల్లిపై గణేష్ దాడి చేయడం చూసి ఆగ్రహించిన పోతురాజు ఇంట్లో ఉన్న వ్యవసాయ కత్తితో అతడిపై ప్రతిదాడి చేశాడు. దీంతో, గణేష్ కాళ్లు, చేతులు, తొడ, నుదుటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి.మనోహర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గణేష్‌ను చికిత్స నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం మేరకు గణేష్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని, గణేష్ తల్లి గంగారత్నం చేతికి స్వల్ప గాయమైందని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
రేషన్ బియ్యం పట్టివేత
పిఠాపురం: రేషన్ బియాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసి, 29.640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మోహన్‌నగర్ – గోర్స రోడ్డులో లారీలో తరలిస్తున్న 29.640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ సమక్షంలో పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.14.22 లక్షలు ఉంటుందని తెలిపారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.


