కర్షకుడిపై కక్ష! | - | Sakshi
Sakshi News home page

కర్షకుడిపై కక్ష!

Mar 14 2026 7:50 AM | Updated on Mar 14 2026 7:50 AM

శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026

ఈ రైతు పేరు నీతిపూడి శేఖర్‌ బాబు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామస్తుడు. రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.30 వేల చొప్పున రెండెకరాలకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే మోంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయారు. ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితి. రబీలోనైనా గట్టెక్కుదామంటే.. పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నదాత సుఖీభవ సాయం అందుతుందని ఆశించినా.. పెట్టుబడికి అవకాశం లేక తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కౌలు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆయన వాపోతున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం: పథకం ఏదైనా కోతలు, ఆంక్షలు, నిబంధనలే అజెండాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్‌ కొంత మందికే ఇచ్చి మమ అనిపించింది. తల్లికి వందనంలో నిబంధనలు పెట్టి నిధులు అందకుండా తల్లులకు ద్రోహం చేసింది. తాజాగా కర్షకులకు సైతం అందే పంథా అవలంబిస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదలలో తీరని అన్యాయం చేసింది. పథకంలో భారీ స్థాయిలో కోతలు విధించింది. ఇప్పటికే ఈ ఏడాది సొమ్ము ఎగరగొట్టిన కూటమి సర్కారు.. వైఎస్సార్‌ సీపీ ఆందోళనలతో ఎట్టకేలకు పథకం అమలు చేస్తోంది. అందులోనూ కోతలు విధించి చేతులు దులుపుకొనేందుకు కుట్ర చేస్తోంది.

ఇదీ సంగతి

సూపర్‌ సిక్స్‌లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వైఎస్సార్‌ సీపీ, ప్రజల పోరాటాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల చొప్పున ఏడాదికి మొత్తం రూ.20 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ (మూడవ విడత), పీఎం కిసాన్‌ (2025–26) కార్యక్రమం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.6 వేలు జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటించారు. ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం ద్వారా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అర్హులైన ప్రతి రైతు కుటుంబం బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కేంద్ర నిధులతో కలిపి ఇస్తోంది. పైకి మాత్రం తానే పూర్తి నిధులు ఇస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. జిల్లాలో 1,14,991 రైతుల ఖాతాల్లో రూ.65.08 కోట్లు జమ చేశారు.

కౌలు రైతులపై కనికరమేదీ?

చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ‘అన్నదాత సుఖీభవ’ నిధులు కౌలు రైతులకు అందిన దాఖలాలు లేవు. కౌలు రైతులకు సీసీఆర్‌సీల జారీలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. భూ యజమాని సమ్మతితోనే వారికి ఆ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాన్ని చేరుకోలేకపోయారు. కార్డులు అందిన రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధులు అందిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రూ.6 వేల సాయం ప్రకారం కౌలు రైతులకు సుమారు రూ.66 కోట్లు నష్టపోవాల్సి వస్తోంది.

వైఎస్సార్‌ సీపీ హయాంలో క్రమం తప్పకుండా

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్‌ సీపీ ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 అందజేశారు. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు.

18,511 మంది రైతులకు మొండిచేయి

వైఎస్సార్‌ సీపీ ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఏడాది తర్వాత పథకం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం 18,511 మందిని ఈ పథకానికి దూరం చేసింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి ‘రైతు భరోసా’ నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,14,991కి కుదించేశారు. వీరు తమకు అందాల్సిన రూ.14.35 కోట్లు నష్టపోయారు.

తొలి ఏడాది రూ.160 కోట్లు హుష్‌కాకి

కూటమి ప్రభుత్వం 2024 జూన్‌ 12వ తేదీన అధికారం చేపట్టింది. ఆ వెంటనే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రగల్భాలు పలికింది. తొలి ఏడాది ఇవ్వాల్సిన సొమ్ములు ఎగొట్టింది. జిల్లాలోని రైతులకు కేవలం కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.6 వేలు మాత్రమే అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలను వేయలేదు. ఫలితంగా ఆ ఏడాదికి రైతులు సుమారు రూ.160.98 కోట్లు నష్టపోయారు.

‘అన్నదాత సుఖీభవ’

లబ్ధిదారుల్లో భారీగా కోత

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

ఏటా 1.33 లక్షల మందికి లబ్ధి

ప్రస్తుతం 1.14 లక్షలకు కుదింపు

ఏటా రూ.20 వేలు ఇస్తామన్న సర్కారు

ప్రస్తుతం ‘పీఎం కిసాన్‌’తో

కలిపి రూ.6 వేలు ఇస్తున్న వైనం

తొలి ఏడాది సొమ్ముల ఎగవేత

దగాయే రివాజుగా

కూటమి ప్రభుత్వం పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement