జీజీహెచ్‌ దుస్థితిపై గవర్నర్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ దుస్థితిపై గవర్నర్‌కు ఫిర్యాదు

Mar 14 2026 7:50 AM | Updated on Mar 14 2026 7:50 AM

కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో వైద్య సేవల దుస్థితిపై ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్‌ సెక్రటరీకి చేరుకుంది. కాకినాడ రేచర్లపేటకు చెందిన పొలుమూరి మధుబాబు (52) లిఖితపూర్వకంగా ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. ఆయన గుండె సమస్యతో బాధ పడుతున్నారు. గతంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు నాలుగు స్టెంట్లు వేశారు. ఈ స్థితిలో మధుబాబు ఆయాసం, దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులకు గురై, గడచిన ఐదు నెలల్లో ఆరుసార్లు కాకినాడ జీజీహెచ్‌కు వచ్చారు. అక్కడ వార్డులో ఒక్కో మంచానికి ఇద్దరు ముగ్గురు రోగుల్ని ఉంచడం గమనించానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అత్యవసర విభాగం నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు రూ.200 డిమాండ్‌ చేశారని, తన వద్ద డబ్బులు లేవని చెప్తే వార్డు షిఫ్టు పెట్టినప్పటికీ అత్యవసర విభాగంలోనే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత్యంతరం లేక ఆయాసంతో నడచి వస్తుంటే అలా వెళ్లకూడదంటూ నర్సులు గదమాయించారని ఆరోపించారు. చివరకు ఎంఎన్‌ఓకు రూ.200 ఇవ్వక తప్పలేదని, ఆ తర్వాతే తనను స్ట్రెచర్‌లో వార్డుకు తరలించాడని వివరించాడు. అప్పటికే ఇద్దరు రోగులున్న పడకపై మూడో వ్యక్తిగా తనను వేశారని, ఒకే మంచంపై ముగ్గురేమిటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇలాగే ఉంటుందని, నచ్చకపోతే వెళ్లిపోమంటూ దురుసుగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలానే ఎందరో రోగులు జీజీహెచ్‌లో మగ్గిపోతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత ఫొటోలను మధుబాబు జత చేశారు. ఆయన గత నెల 7న గవర్నర్‌కు ఈ ఫిర్యాదు పంపగా, సంబంధిత విభాగాల పరిశీలన అనంతరం శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్‌ సెక్రటరీకి చేరింది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement