● వంట గ్యాస్‌పై నిరంతర పర్యవేక్షణ
● కంట్రోల్ రూమ్ ఏర్పాటు
● జిల్లా పౌర సరఫరాల అధికారి పార్వతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గృహ అవసరాలు, అత్యవసర సేవలకు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో పాటు ఎల్పీజీ పంపిణీదారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లాలోని 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సరఫరా అవుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లు సాధారణంగా పనిచేస్తుండగా, ఎల్పీజీ సిలిండర్ల నిల్వ కూడా తగినంతగా ఉందన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల రీఫిల్ బుకింగ్‌లు తాత్కాలికంగా పెరిగాయనీ, అయినప్పటికీ డెలివరీలు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో సాగుతున్నాయన్నారు. దీని వల్ల కొన్ని చోట్ల తాత్కాలిక జాప్యం ఏర్పడినా , సరఫరాలో ఎటువంటి ఇబ్బందీ లేదని తెలిపారు. పారిశ్రామిక, బల్క్ ఎల్పీజీ సరఫరాను మాత్రమే పరిమితం చేయగా, గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తూ పంపిణీదారులకు సూచనలిస్తున్నారు. కాబట్టి వినియోగదారులకు ఆందోళన అవసరం లేదన్నారు.
హెల్ప్‌లైన్ ఏర్పాటు
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎల్పీజీ సంబంధిత ఫిర్యాదుల కోసం 8074661259 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 225.46 మెట్రిక్ టన్నులు గ్యాస్ (15,742 సిలిండర్లు) అందుబాటులో ఉన్నాయన్నారు.
గ్యాస్ బుకింగ్ ప్రత్యామ్నాయ పద్ధతులు
వినియోగదారులు ఒకేసారి ఎక్కువగా బుకింగ్‌లు చేయడం వల్ల కొన్ని చోట్ల కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు వస్తున్నందున కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు.
భారత్ గ్యాస్ కోసం
వాట్సప్ 1800 22 4344కు హయ్ అని పంపాలి
మిస్డ్‌కాల్: 7710955555
ఐవీఆర్‌ఎస్: 7715012345 / 7718012345
ఇండేన్ గ్యాస్ కోసం
వాట్సప్ 7588888824కు హాయ్ అని పంపాలి
మిస్డ్‌కాల్ : 8454955555
ఐవీఆర్‌ఎస్ 7718955555
హెచ్‌పీ గ్యాస్ కోసం
వాట్సప్ 9222201122కు ‘ఏజీ’ అని పంపాలి
మిస్డ్‌కాల్: 9493602222
ఐవీఆర్‌ఎస్ 8888823456 / 9666023456
అలాగే సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్‌ల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు.


