రేగే జ్వాలలపై ఊగిసలాట
సాక్షి, అమలాపురం/ మలికిపురం: చమురు, సహజ వాయువు వెలికితీత కోసం ఓఎన్జీసీ చేసే అన్వేషణలో తరచూ బ్లో అవుట్‌లు.. గ్యాస్ పైప్‌లైన్ల లీకేజీలు చోటు చేసుకుంటున్నాయి. పచ్చని కోనసీమలో చమురు సంస్థలు తమ కార్యకలాపాలతో పెను విపత్తులకు కారణమవుతున్నాయి. ఇటువంటి విపత్తులు జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల గ్రామాల వాసులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కట్టుబట్టలతో పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ విపత్తులన్నీ మానవ తప్పిదాలే కాగా.. బ్లో అవుట్, గ్యాస్ పైప్‌లైన్ లీకుల తరువాత విపత్తులను ఎదుర్కొనే విషయంలో ఓఎన్జీసీ వ్యవహరిస్తున్న తీరు.. అలసత్వం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ముందు జాగ్రత చర్యలు శూన్యం
ప్రభుత్వ, ప్రైవేటు రంగ చమురు సంస్థలకు కోనసీమ అక్షయపాత్రగా మారింది. అపారమైన చమురు, సహజ వాయువులను నిక్షిప్తం చేసుకున్న కేజీ (కృష్ణా, గోదావరి) బేసిన్ గడచిన నాలుగు దశాబ్దాలుగా చమురు సంస్థలకు వేల కోట్ల రూపాయలు అందిస్తోంది. దీనికోసం వారు చేస్తున్న కార్యకలాపాల వల్ల జిల్లాలో తరచూ ఏదో ఒకచోట భారీ విపత్తు చోటు చేసుకుంటోంది. ఇక చిన్న చిన్న గ్యాస్ లీకేజీలు, మంటలు రావడం సర్వ సాధారణంగా మారింది. అయితే భారీ బ్లో అవుట్‌లు జరుగుతున్న సమయంలో ఓఎన్జీసీతోపాటు చమురు సంస్థల స్పందన అత్యంత పేలవంగా ఉంటోంది. భారీ మంటలు చేలరేగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే కాకుండా చుట్టుపక్కల నివాసముంటున్న వారు కూడా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇది తప్పనిసరి. అయితే డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాలు చేసే చోట ప్రమాదం జరిగితే ఎదుర్కొనే ముందు జాగ్రత చర్యలు మాత్రం పాటించడం లేదు. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5వ వద్ద సోమవారం బ్లో అవుట్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఉదయం 11 గంటలకు జరిగితే ఒంటి గంటకు మంటలు చెలరేగాయి. అయితే సాయంత్రం ఆరు గంటల వరకు కనీసం మంటలు ఆర్పే చర్యలను చేపట్టలేదు. మంటలను ఎలా అదుపు చేయాలనేది ఇక్కడ బావి వద్ద ఉన్నవారికే కాదు.. ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు కూడా పాలుపోలేదు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థకు చెందిన ఫైర్ ఇంజిన్లు, ఓఎన్జీసీ ఫైర్ ఇంజిన్లు వచ్చినా ఘటనా ప్రాంతానికి వెళ్లే సాహసం చేయలేకపోయాయి. నరసాపురం, రాజమహేంద్రవరంలలో ఉన్న క్రైసిస్ మేనేజ్‌మెంట్ (సంక్షోభ నివారణ) బృందాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పటి వరకు చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి నెలకొంది. వారు వచ్చి మంటల అదుపునకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించిన తరువాతనే మంటల మీదకు నీటి పంపింగ్ చేపట్టారు. స్థానికంగా వచ్చిన ఫైర్ ఇంజిన్లకు అందుబాటులో పెద్దగా నీరు లేదు. సమీపంలో ఉన్న పంట బోదెల నుంచి పెద్దగా నీరు సేకరించే అవకాశం లేకపోవడంతో ట్యాంకర్లతో ముందస్తుగా నీరు తరలించాల్సి వచ్చింది.
అలసత్వంపై కోనసీమ వాసుల మండిపాటు
కేజీ బేసిన్‌లో కార్యకలాపాలు అన్నీ జరిగేవి కోనసీమ, కాకినాడ జిల్లాల తీర ప్రాంతాల్లోనే. ఆఫ్ షోర్ (సముద్రంలో), ఆన్‌షోర్ (ఒడ్డున) జరిగే కార్యకలాపాలు ఈ రెండు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ డ్రిల్లింగ్, చమురు, సహజ వాయువుల వెలికితీత, పైప్‌లైన్ల ద్వారా తరలింపు జరుగుతోంది. ఓడలరేవు, తాటిపాక, గాడిమొగ, కేశనపల్లి వంటి ప్రాంతాల్లో చమురు, సహజ వాయువుల నిల్వ చేయడం, తరలించడం చేస్తుంటారు. ఇక్కడ భారీ కార్యకలాపాలు జరగుతుంటాయి. ఈ కార్యకలాపాల వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవిస్తోంది. ఇంత జరుగుతున్నా ఈ జిల్లాలో కనీసం క్రైసిస్ మేనేజ్‌మెంట్ బృందాన్ని, వారికి అవసరమైన అధునాతన సామగ్రిని అందుబాటులో ఉంచడంలో ఓఎన్జీసీ, ఇతర చమురు సంస్థలు ఉదాసీన వైఖరితో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేయాలని స్థానికులు దశాబ్దకాలంగా డిమాండ్ చేస్తున్నా లెక్క చేయడం లేదు. అల్లవరం మండలం దేవర్లంక (పాశర్లపూడి)లో బ్లో అవుట్ జరిగినప్పుడే ఈ డిమాండ్ తెర మీదకు వచ్చింది. నాటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీనివల్లే ప్రమాదాలు జరుగుతున్న సమయంలో మంటలు ఆర్పేందుకు, గ్యాస్‌ను కట్టడి చేసేందుకు రోజులపాటు ఎదురు తెన్నులు చూడాల్సి వస్తోంది. ఓఎన్జీసీ, చమురు సంస్థలు అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరిపైనే కోనసీమ వాసులు మండిపడుతున్నారు.
బ్లో అవుట్ జరిగిన చోట సోమవారం మధ్యాహ్నం సమయంలో పక్కన పెట్టి ఉంచిన ఫైర్ ఇంజిన్లు
బ్లో అవుట్ జరిగిన చోట సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పైపులు సద్దుతున్న ఫైర్ సిబ్బంది
భారీ ప్రమాదాలకు కారణమవుతున్న
ఓఎన్జీసీ ఉదాసీన వైఖరి
ఆపత్కాలంలో చేష్టలుడిగి
చూస్తున్న స్థానిక సిబ్బంది
నరసాపురం, రాజమహేంద్రవరం
నుంచి విపత్తు నివారణ
బృందాలు రావాల్సిందే
కేజీ బేసిన్ కార్యకలాపాలన్నీ
కోనసీమ గడ్డ మీద
కార్యాలయాలు, నిపుణుల బృందాలు
ఉండేది రాజమహేంద్రవరంలో..
స్థానికంగా సౌకర్యాలు కల్పించాలని
దశాబ్దాలుగా జనం డిమాండ్
ఏమాత్రం పట్టించుకోని ఓఎన్జీసీ
రేగే జ్వాలలపై ఊగిసలాట
రేగే జ్వాలలపై ఊగిసలాట


