డీఎల్‌ఎస్‌ఏ జోక్యంతో మహిళకు న్యాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): న్యాయ సేవాధికార సంస్థ జోక్యంతో పి.పద్మావతి అనే మహిళకు రూ.11,09,637 పెన్షన్ బకాయి విడుదలైంది. ఈ విషయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే..
పద్మావతి తండ్రి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తూ మృతి చెందగా, ఆయన పెన్షన్ ఆమె తల్లికి అందేది. 2015లో తల్లి మరణించడంతో పద్మావతికి డిపెండెంట్ పెన్షన్ బకాయిలు, నెలవారీ పెన్షన్ మంజూరు కాకుండా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరానికి చెందిన అడ్వకేట్ తూము కళ్యాణం దొర ద్వారా జిల్లా న్యాయసేవాధికారను పద్మావతి ఆశ్రయించింది. దీంతో డీఎల్‌ఎస్‌ఏ సంబంధిత శాఖ అధికారులను పిలిపించి విచారణ చేపట్టి, పద్మావతికి చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్ బకాయిలు, నెలవారీ పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంది. అదే విధంగా నెలవారీగా రూ.14 వేలు పెన్షన్ మంజూరు కావడంతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత, కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీకి పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.


