ప్రయాణాలు ఘాట్‌లో.. ప్రాణాలు గాల్లో
చింతూరు: కాస్త ఆగండి.. రాత్రి పూట ప్రయాణాలు మానండి.. ఘాట్ రోడ్డులో వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నా, ఎక్కడా వాహనాలకు బ్రేక్ పడడం లేదు.. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఎందరో ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.. గత నెల 12న తెల్లవారు జామున చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యూ పిన్ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. రాత్రి ప్రయాణమే ప్రమాదానికి కారణమని భావించిన అధికారులు అదే రోజు నుంచి ఘాట్‌రోడ్డులో రాత్రిళ్లు వాహన రాకపోకలు నిషేధించారు. తదుపరి ఆదేశాల వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
పొరుగు రాష్ట్రాల సరకు రవాణాకు చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్లు అనువుగా ఉంటాయి. అందుకే ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణకు చెందిన సరకు రవాణా వాహనాలతో పాటు బస్సులు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కొబ్బరికాయలు, బెల్లం, ఉల్లిపాయలు, కోళ్లతో పాటు కూరగాయలు అధికంగా రవాణా అవుతాయి. ఒడిశాకు చేపలు, ప్లాస్టిక్ వస్తువులు, కోళ్ల రవాణా జరుగుతుంది. మరోవైపు విలీన మండలాల నుంచి తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ధాన్యం, పొగాకు, అపరాలు అధికంగా తరలిస్తుంటారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా ఇటుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ రాకపోకలను అధికారులు నిషేధించారు. ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ లారీలు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. పగలు రద్దీ దృష్ట్యా భారీ వాహనాలు సైతం రాత్రిళ్లు ప్రయాణిస్తూ మలుపులు వద్ద ఎత్తు ఎక్కలేక నిలిచిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు చింతూరు వైపున, అటు మారేడుమిల్లి వైపున రాత్రిళ్లు వాహనాల రాకపోకలు నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడా ప్రమాదాలు ఆగడం లేదు. మరోవైపు ఘాట్ రోడ్‌లో భారీ వాహనాల రాకపోకలపై సరైన నియంత్రణ లేక తరచూ మలుపుల వద్ద ఎత్తు ఎక్కలేక నిలిచిపోతున్నాయి. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
మరోమారు నిషేధాజ్ఞలు
కాగా ఘాట్‌రోడ్డులో రాత్రిపూట వాహనాల రాకపోకలపై రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరణ్‌రాజ్ మరోసారి ఈ నెల 6న నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటవాలు మలుపులు, రాత్రిపూట రహదారి సరిగా కనిపించకపోవడం, వన్యప్రాణుల సంచారం కారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. దీనిపై పోలీసు, అటవీ, ఆర్‌అండ్‌బీతో పాటు స్థానిక ప్రభుత్వ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు.
ఘాట్ రోడ్డులో మలుపు వద్ద నిలిచిపోయిన భారీ వాహనం
ఫ ఘాట్ రోడ్డులో రాత్రి ప్రయాణాలు
ఫ నిషేధాజ్ఞలు ఉన్నా ఆగని వైనం
ఫ నిఘా వ్యవస్థ లేక నియంత్రణ కరవు
ప్రమాదాలు... మరణాలు
ఘాట్ రోడ్డులో సరైన రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల 12న చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలోకి బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. 2019 అక్టోబర్ 15న కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ ఎగువ రహదారి పైనుంచి దిగువ రహదారిపై పడడంతో ఏడుగురు మృతి చెందారు. గతంలో చింతూరులో సువార్త సభలకు వచ్చిన క్రైస్తవులు ఆటోలో వెళుతున్న క్రమంలో లోయలోకి జారిపడడంతో ఐదుగురు చనిపోయారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడకు వెళ్తున్న భవానీ భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఘాట్ రోడ్డులోని దుర్గ గుడి సమీపంలో లోయలో పడడంతో ఏడుగురు భవానీలు దుర్మరణం పాలయ్యారు. పై సంఘటనల్లో నాలుగు రాత్రి పూట జరిగినవే కావడం గమనార్హం. ఇవన్నీ పెద్ద సంఘటనలే. కాగా ఇదే ఘాట్ రోడ్డులో ఒకరు, ఇద్దరు చొప్పున మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ప్రయాణాలు ఘాట్‌లో.. ప్రాణాలు గాల్లో
ప్రయాణాలు ఘాట్‌లో.. ప్రాణాలు గాల్లో


