సమ్మె సైరన్!
● 108 ఉద్యోగుల నిరసన
● డిమాండ్ల సాధనకు ఉద్యమ బాట
● చంద్రబాబు ప్రభుత్వానికి
ఈ నెల 12 వరకూ గడువు
● సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
● అధికారులకు నోటీసులు అందజేత
సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర వైద్యం అందించే 108 వ్యవస్థ, ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. ఆపద్బాంధవులపై అక్కసు ప్రదర్శిస్తోంది. ఎమర్జెన్సీ వైద్యం అందించే ఉద్యోగులపై నిర్లక్ష్యపు ధోరణి అవలంభిస్తోంది. గతంలో వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తోంది. ఆరు నెలలుగా సమస్యలు పరిష్కారానికి చొరవ చూపకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వారందరూ సమ్మె సైరన్ మోగించనున్నారు.
ఆరు నెలలుగా నిరీక్షణ
చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో 108 ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆరు మాసాల క్రితం ఆందోళనకు దిగిన ఉద్యోగులను బుజ్జిగించి, సమస్యలకు పరిష్కారం చూపుతామని నమ్మబలికిన ప్రభుత్వం నేటికీ వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో చేసేది లేక తిరిగి సమ్మెకు దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 12 నుంచి సమ్మెలోకి వెళతామని అల్టీమేటం జారీ చేశారు. 18 డిమాండ్లతో కూడి సమ్మె నోటీసును జిల్లా వైద్యాధికారి, 108 కో ఆర్డినేటర్లకు అందజేశారు.
జిల్లాలో ఇలా..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 21 ఉన్నాయి. వీటిలో 115 మంది ఈఎంటీ, పైలెట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతి నెలా వేల సంఖ్యలో క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న బేధం లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఈ వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తోంది.
సెలవులు లేకుండా..
108 సిబ్బంది అత్యవసర విధుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు రోజుకు దాదాపు 12 గంటల పాటు పనిచేయాలి. అదనంగా చేసే పనికి ఎటువంటి అదనపు చెల్లింపులు ఇవ్వడం లేదు. ఒక్కో వాహనానికి కనీసం ఆరుగురు ఉద్యోగులు రెండు షిప్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్నా అలాగే నెట్టుకొస్తున్నారు. ఏ ఉద్యోగీ వారాంతపు సెలవు తీసుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పండగల సెలవులను మర్చిపోయారు. డ్యూటీ వేసిన మరుక్షణం వెళ్లిపోవాల్సిందే. అంత యాతన అనుభవించి పనిచేస్తున్నా ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది.
శిశు సంజీవని ఏదీ?
పుట్టిన నెలలోపు చంటి పిల్లలకు వైద్యం అందించడంలో శిశు సంజీవని వాహనం కీలక భూమిక పోషించేది. ఈ వాహనంలో అత్యాధునిక వసతులు ఉంటాయి. చంటి పిల్లలకు అత్యవసరమైన వెంటిలేటర్, ఇంక్యూబేటర్ తదితర అధునాతన వసతులతో రూపొందించారు. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న వాహనం తూర్పుగోదావరి జిల్లాకు ఒక్కటి కూడా ప్రస్తుతం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. రోడ్డు ప్రమాదానికి గురై ఆ వాహనం పూర్తిగా పాడైపోయింది. అప్పటి నుంచి మరో వాహనం అందుబాటులోకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఈ వాహనం ద్వారా ప్రతి రోజూ సుమారు నలుగురు చంటి పిల్లలకు, నెలకు 100 మంది చంటి పిల్లలకు అత్యవసర వైద్యం అందేది. వాహనం లేకపోవడంతో ఆ వైద్యం స్తంభించింది.
డిమాండ్లు ఇవే...
108 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ.2 వేలు మాత్రమే పెంచారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం ఈపీఎఫ్‌ఓ యాజమాన్య వాటాను యజమాన్యమే చెల్లించాలని చెప్పినా నేటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
చిన్న కారణాలను చూపిస్తూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం మానుకోవాలి.
ఈఎంటీలను ట్రైనింగ్ పేరిట భయభ్రాంతుల కు గురి చేస్తున్నారు. ట్రైనింగ్ అంటే ఉన్న నాలె డ్జ్‌ని పెంపొందించేలా ఉండాలే తప్ప, భయభ్రాంతులకు గురి చేస్తూ ఫెయిల్ అయితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని చెప్పడం దారుణం.
ప్రతి అంబులెన్స్ ఉన్నచోట సిబ్బంది ఉండేందుకు వసతి, వాహనం నిలుపుకొనేందుకు పక్కా షెడ్డు నిర్మించాలి.
వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి.
భవ్య సంస్థ 108 బాధ్యతలు తీసుకుని ఏడు మాసాలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వలేదు. వేతనాలపై సైతం స్పష్టత లేకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్ శ్లాబ్ అప్‌గ్రేడ్ చేయాలి. పనిష్‌మెంట్ కాలాన్ని చూపుతూ వేతనం తగ్గించడం తగదు. శ్లాబ్‌కు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి.
కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. గతంలో మాదిరిగా షిఫ్ట్‌కు రూ.200 ఇవ్వాలి.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరహా పండగ ప్రయోజనాలు కల్పించాలి. వాహనాల్లో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలి.
ఐఎఫ్‌టీ కేసుల్లో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్లకు తెలపాలి.
గతంలోనూ ఇబ్బందులు
కొన్ని నెలలుగా 108 ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. 108లో పనిచేసే ఈఎంటీ, పైలెట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందుతోంది. సూపర్ వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. గతంలో మూడు మాసాల వేతనాలు మంజూరు చేయలేదు. వెరసి ఉద్యోగులకు ఆకలి కేకలు తప్పలేదు.
18 డిమాండ్లతో వినతి
పైన తెలిపిన దాదాపు 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం, డీఎంఅండ్‌హెచ్‌ఓ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కార్యాలయాల్లో 108 ఉద్యోగులు అందజేశారు. తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 12 తర్వాత ఏ క్షణమైనా 108 వాహనాలను నిలుపుదల చేసి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
సమ్మె సైరన్!
సమ్మె సైరన్!


