బతుకు పూలబాట | - | Sakshi
Sakshi News home page

బతుకు పూలబాట

Jan 8 2026 7:05 AM | Updated on Jan 8 2026 7:05 AM

బతుకు

బతుకు పూలబాట

పెరవలి: ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పక్కన పూల తోటలు కనిపిస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. కాసేపు అక్కడే ఆగి, ఆ తోటల్లో పూలను చూస్తూ ఆనంద పడతాం. మన ఫోన్‌తో ఫొటోలు తీసుకుని పదిలంగా దాచుకుంటాం. అయితే నిత్యం ఆ తోటల్లో పనిచేస్తూ, పూలతో సహజీవనం చేస్తే ఎలా ఉంటుంది. ఇది అందరికీ సాధ్య కాకపోయినా కాకరపర్రు వాసులకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. ఎందుకంటే వారి జీవితమంతా వాటితోనే ముడిపడి ఉంది. ఒకప్పుడు కూలి పనులు సక్రమంగా లేక అర్ధాకలితో జీవించిన వారందరూ ఇప్పుడు పూలతోటలపై ఆధారపడి సంతోషంగా బతుకుతున్నారు.

ఎక్కడ చూసినా పువ్వులే..

పెరవలి మండలం కాకరపర్రు గ్రామం పూల తోటలతో కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా వివిధ రకాల పూల మొక్కలే దర్శనమిస్తాయి. ఈ గ్రామ జనాభా దాదాపు ఆరు వేల మంది కాగా, వారిలో సుమారు నాలుగు వేల మందికి పైగా పూల సాగు, పూల వ్యాపారంతో ఉపాధి పొందుతున్నారు. కాకరపర్రు గ్రామం సుమారు ఐదు కిలోమీటర్ల మేర విస్తరించింది. దాదాపు 1200 ఎకరాల పంట భూమి ఉంటే, దానిలో 800 ఎకరాల్లో పూల తోటలను సాగుచేస్తున్నారు. గ్రామంలో 1200 కుటుంబాలకు చెందిన దాదాపు 4,500 మంది జీవిస్తున్నారు. ఇక్కడ బంతి, చామంతి, లిల్లీ, గులాబీ, మొల్లలు, విర, సన్న జాజులు, మల్లెపూలు వంటివి సాగు చేస్తారు.

జీవనాధారం

గ్రామంలోని దాదాపు 900 కుటుంబాలు పూలసాగుపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీటిలో కొందరు పూల తోటలను పెంచుతుండగా, మరికొందరు పూల వ్యాపారం చేస్తారు. ఇళ్ల మహిళలందరూ పూలమాలలు, దండలు కడుతూ ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలో ఇంటి దగ్గర ఏమాత్రం స్థలం ఉన్నా పూల మొక్కలు వేస్తారు. చిరు వ్యాపారులు ఇచ్చిన పువ్వులను మాలలుగా కడుతూ మహిళలు ఉపాధి పొందుతున్నారు. కిలో బంతిపూలను మాలగా కడితే రూ.40, కనకాంబరాలకు రూ.150, కాగడాలు, మల్లెలు, విరజాజులకు రూ.100 ఇస్తారు. ఇలా ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ రోజుకు రూ.200 నుంచి రూ.400 వరకు సంపాదిస్తారు. శుభముహుర్తాలు, పండగల సమయంలో ఇంకొంచెం ఆదాయం వస్తుంది. ఇక యువకులు పెళ్లి మంటపాల పూల డెకరేషన్‌కు వెళతారు. అలా రోజుకు రూ.వెయ్యి వరకూ సంపాదిస్తారు. మగవారు మోటారు సైకిళ్లు, సైకిళ్లపై వివిధ గ్రామాలకు వెళ్లి పూలను విక్రయిస్తూ ఉంటారు. కాకరపర్రు గ్రామంలో ఏ మూలకు వెళ్లినా పూలతోటలే దర్శనమిస్తాయి. అన్నిచోట్ల్లా పూల సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. గోదావరికి ఆనుకుని ఉన్న ఈ గ్రామం ఎంతో పచ్చగా కనువిందు చేస్తుంది. శీతాకాలంలో మంచు తెరల మధ్య మరింత అందంగా కనిపిస్తుంది. ప్రకృతి రమణీయతకు పూలతోటల అందం తోడవుతుంది.

మార్కెట్‌లో వసతుల కరవు

కాకరపర్రు పూల మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచి వ్యాపారస్తులు వచ్చి, తమకు కావాల్సిన పూలను కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్‌లో కనీస సౌకర్యాలు లేవు, తాటాకు పాకల్లోనే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో పూలు వచ్చినప్పుడు నిల్వ చేసుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇక్కడ పూలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

పువ్వులను మాలలుగా కడుతున్న మహిళలు

పూలదండలను కడుతూ..

పూల తోటలకు

చిరునామాగా కాకరపర్రు

దాదాపు గ్రామమంతా అదే సాగు

సుమారు 900

కుటుంబాలకు ఆధారం

మాలలు కడుతూ మహిళల ఉపాధి

పూలను విక్రయిస్తూ మగవారి జీవనం

పూల మండపాల

డెకరేషన్‌లో యువకులు

నిత్యం ఆదాయం

ఒక ఎకరం పొలంలో వివిధ రకాల పూల తోటలను సాగు చేస్తున్నాను. వాటి నుంచి నిత్యం ఆదాయం వస్తోంది. అయితే మార్కెట్‌లో తగిన సౌకర్యాలు లేవు. పూలు నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉండడం లేదు.

– మానేపల్లి శ్రీనివాస్‌, కాకరపర్రు

మాలలు కడుతూ..

నా భర్త కూలి పనులకు వెళుతుంటారు. నేను ఇంటి వద్దే పువ్వులను మాలలుగా కడుతుంటారు. చిరు వ్యాపారస్తులు పూలను మా ఇంటి దగ్గరకు పట్టుకొచ్చి ఇస్తారు. వాటిని మాలలు కట్టి రోజుకు రూ.200 పైగా సంపాదిస్తున్నాను.

– షేక్‌ హుస్సేన్‌ బీబీ, కాకరపర్రు

పూలకొట్టులో పని

పూల కొట్టులో కూలిగా పనిచేస్తూ నెలకు రూ.10 వేల వరకూ సంపాదిస్తున్నాను. మా గ్రామంలో యువకులందరూ పూల వ్యాపారం, మంటపాలు కట్టటం, పూల సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

– మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు

పువ్వుల అమ్మకం

పువ్వులను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాను. సైకిల్‌ లేదా ద్విచక్ర వాహనంపై వివిధ గ్రామాలకు తిరుగుతూ పూలను అమ్ముతాను. మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటే రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకూ ఆదాయం వస్తుంది.

– కాపకా సూర్యనారాయణ, కాకరపర్రు

బతుకు పూలబాట1
1/7

బతుకు పూలబాట

బతుకు పూలబాట2
2/7

బతుకు పూలబాట

బతుకు పూలబాట3
3/7

బతుకు పూలబాట

బతుకు పూలబాట4
4/7

బతుకు పూలబాట

బతుకు పూలబాట5
5/7

బతుకు పూలబాట

బతుకు పూలబాట6
6/7

బతుకు పూలబాట

బతుకు పూలబాట7
7/7

బతుకు పూలబాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement