అటవీ ఉత్పత్తుల ఖ్యాతికి కృషి
● భౌగోళిక గుర్తింపునకు చర్యలు
● రిసొల్యూషన్ కంపెనీ సీఈతో
ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ సమావేశం
రంపచోడవరం: చీపురే కాదా అని తీసిపారేయకండి.. అదే చీపురుకు జియోట్యాగ్ ( భౌగోళిక గుర్తింపు) కోసం రంపచోడవరం ఐటీడీఏ పీవో కృషి చేస్తున్నారు. ఏజెన్సీలో దొరికే వాటికి భౌగోళిక గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బచ్చు స్మరణ్‌రాజ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌కు చెందిన రిసొల్యూట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుభజిత్ సహాతో సమావేశమైయ్యారు. ఏజెన్సీలో లభించే అటవీ ఉత్పత్తులు కొండచీపురు, జాఫ్రా, జీలుగు కల్లు నుంచి తయారు చేసే బెల్లం, పసుపులకు భౌగోళిక గుర్తింపు కోసం చర్చించారు. ఇందులో భాగంగా ఆ సంస్థ ద్వారా సమగ్ర నివేదికను తయారు చేస్తారు. అటవీ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ (జియో గ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్)ను తయారు చేసి చైన్నెలోని ఇండియన్ పేటెంట్ రైట్స్ ఆర్గనైజేషన్‌కు సమర్పిస్తారు. ఆ సంస్థ గుర్తించిన ఉత్పత్తులను ప్రతి నెల ప్రచురించే జర్నల్‌లో అచ్చువేస్తారు. దీని ద్వారా జాతీయ స్థాయిలో ఆ ఉత్పత్తులకు గుర్తింపు లభిస్తుంది. మంచి మార్కెట్‌కు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 16 రకాల ఉత్పత్తులకు జియో ట్యాగ్ గుర్తింపు లభించింది. వీటిలో తిరుపతి లడ్డూ, కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ పట్టు, ఆత్రేయపురం పూతరేకులు తదితర ఉత్పత్తులు ఉండగా అటవీ ఉత్పత్తులను వాటి పక్కన చేర్చేందుకు కృషి చేస్తున్నారు. పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ఫుడ్ సైంటిస్టు, కో ఆర్డినేటర్ డాక్టర్ వీసీ వెంగయ్య గత ఏడాది డిసెంబరులో నూరుశాతం సహజసిద్ధంగా తయారు చేసే తాటి బెల్లానికి జియోట్యాగ్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో లభించే తాటి సహజ సిద్ధమైనదన్నారు. పుసుపులో కుర్కుమిన్ విలువ ఎక్కువ శాతం ఉంటుందన్నారు. బయట ప్రాంతంలో లభించే దాని వాటికంటే సహజ సిద్ధంగా పెరుగుతాయన్నారు. అలాగే జాఫ్రా బిక్సిన్ విలువ ఎక్కువ ఉంటుందన్నారు. పీవో మట్లాడుతూ ఏజెన్సీలోని అటవీ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో భోగోళిక గుర్తింపు వస్తే వాటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుందన్నారు.
అటవీ ఉత్పత్తుల ఖ్యాతికి కృషి


