వర్జీనియాపై శీతావరణం!
దేవరపల్లి: వర్జీనియా పొగాకు తోటలపై పలు రకాల తెగుళ్లు దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తోటలు ఆశాజనకంగా ఉన్నాయని అనుకుంటున్న సమయంలో తెగుళ్లు సోకాయని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల తెగుళ్లు వ్యాపించినట్టు రైతులు తెలిపారు. ఎక్కువగా మొవ్వు కుళ్లు, మొజాయిక్ తెగులు, మానుమచ్చ, ఆకుముడత వంటి తెగుళ్లు వ్యాపించినట్టు రైతులు చెప్పారు. తెల్లదోమ ఎక్కువగా ఉందన్నారు. మొవ్వుకుళ్లు తెగులు సోకిన మొక్కలు కుళ్లిపోయి చనిపోతున్నాయని రైతులు తెలిపారు. మొక్క మొదలు భాగంలో మానుకు మచ్చ ఏర్పడి తోటలు ఎండిపోయి నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక కౌలు, పెట్టుబడులు పెట్టి తోటలు పెంచామని, మరో 10 రోజుల్లో క్యూరింగ్ చేసే సమయంలో తోటలకు తెగుళ్లు సోకడం వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుందని రైతులు తెలిపారు. తెగుళ్ల ప్రభావం దిగుబడులపై పడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎకరాకు 150 నుంచి 200 కిలోలు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నట్టు రైతులు తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు రైతులు చెప్పారు. తెల్లదోమ ఎక్కువగా వ్యాపించడంతో దోమ ఆకులోని రసాన్ని పీల్చడం వల్ల ఆకు వంపులు తిగిరి ముడుచుకుపోతున్నాయని రైతులు వివరించారు. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడం, రాత్రి సమయంలో మంచు కురవడం, చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పొగాకు తోటలపై తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉందని, ఎన్ని మందులు పిచికారీ చేసినా తగ్గడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, కొయ్యలగూడెం మండలాల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉన్నట్టు రైతులు తెలిపారు. లేతగా వేసిన తోటలపై ఉధృతి ఎక్కువగా ఉందని, ముదర తోటల్లో 10 శాతం ఉండగా, లేత తోటల్లో 20 శాతం వరకు ఉందని రైతులు తెలిపారు. గోపాలపురం మండలంలో కొంత మంది రైతులు లేతగా వేసిన తోటలను దున్ని మళ్లీ నాట్లు వేశారు.
62 వేల ఎకరాల్లో సాగు
2025–26 పంట కాలానికి పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో సుమారు 62 వేల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. 12,879 మంది రైతులు ఈ సాగు చేస్తున్నారు. 12,814 బ్యారన్లు ఉన్నాయి.
బొబ్బతెగులు గమనించాం
పొగాకు తోటలపై బొబ్బ (మొజాయిక్), ఆకుముడత తెగుళ్లను గమనించాం. వాతావరణ పరిస్థితుల వల్ల తెగుళ్లు సోకుతున్నాయి. పొగాకు తోటలకు ఉక్కపోత వాతావరణం కావాలి. శీతల గాలులు, మంచు వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి తోటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు అందిస్తాం. రైతులు ఆందోళన చెందనవసరం లేదు.
– పి.హేమస్మిత, పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి, దేవరపల్లి
పొగాకు తోటలపై తెగుళ్ల దాడి
మొక్కలు కుళ్లిపోతున్నాయంటున్న రైతులు
ఉక్కపోత వాతావరణం
కల్పించాలంటున్న శాస్త్రవేత్తలు
ఎకరాకు 150 నుంచి
200 కిలోల దిగుబడి తగ్గే అవకాశం
వర్జీనియాపై శీతావరణం!
వర్జీనియాపై శీతావరణం!
వర్జీనియాపై శీతావరణం!


