అన్నవరప్పాడు ఆలయానికి రూ.4.70 లక్షల ఆదాయం
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4, 58,472, అన్నదాన హుండీ ద్వారా రూ.11,761.. కలిసి మొత్తం రూ.4,70,233 వచ్చిందన్నారు. ఈ ఆదాయం 40 రోజులకు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, గ్రామ పెద్దలు రంగనీటి కట్లయ్య, ఓసూరి బాల నాగేశ్వరరావు, బొలిశెట్టి ప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్‌లో కార్తిక్ ప్రతిభ
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ స్థాయి యోగాసన స్కూల్ గేమ్స్ పోటీలలో నగరానికి చెందిన కర్రి కార్తిక్ రామచంద్రారెడ్డి 5వ స్థానంలో నిలిచాడు. త్రిపుర రాజధాని అగర్తలలో జనవరి మూడు నుంచి ఆరో తేదీ వరకూ ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన కార్తిక్‌కు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సర్టిఫికెట్ అందజేశారు. అతడితో పాటు తండ్రి, యోగా గురువు కేఎన్‌వీ శ్రీధర్ రెడ్డిని అభినందించారు.
రోడ్డు భద్రత అందరి బాధ్యత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా బుధవారం లాలాచెరువు ట్రాఫిక్ జంక్షన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సురేష్ మాట్లాడుతూ ప్రతి వాహన చోదకుడూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. అలాగే లాలాచెరువు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ సంపత్ కుమార్, ఎం.రవికుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు బి.ఉమామహేశ్వరరావు, జి.ప్రణీత్ కుమార్, పీవీవీడీ సాయి కుమార్ పాల్గొన్నారు.
బ్లో అవుట్ వెనుక అవినీతిని
బహిర్గతం చేయాలి
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ వెనుక ఉన్న అవినీతి, అక్రమాలను ఉన్నతాధికారులు తక్షణమే బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ అన్నారు. ఆయన బుధవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బోరింగ్– 5 నిర్వహణ బాధ్యతలను 2025 ఏప్రిల్ నుంచి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అప్పజెప్పారన్నారు. పాతబడిన, ప్రొడక్షన్ తగ్గిన బావులను ఓఎన్‌జీసీ 60–40 నిష్పత్తి చొప్పున నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తోందన్నారు. ఆ విధంగా రూ.1,402 కోట్లకు ఆ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. ప్రమాదానికి హైప్రెజర్ కారణమని అధికారులే చెబుతున్నారని, మరి హైప్రెజర్ ఉన్న వెల్‌ను, లో ప్రెజర్‌గా చూపించి ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీకి ఎలా అప్పజెప్పారని ప్రశ్నించారు. ఓఎన్‌జీసీలో సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారడానికి తాజా ఘటన నిదర్శనమన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు బి.పవన్, మూర్తి, వి.రామచంద్రరావు, బి.పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు.
అన్నవరప్పాడు ఆలయానికి రూ.4.70 లక్షల ఆదాయం
అన్నవరప్పాడు ఆలయానికి రూ.4.70 లక్షల ఆదాయం


