జీవిత పర్యంతం ధర్మాచరణ కొనసాగాలి
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మాచరణ జీవిత పర్యంతం కొనసాగాలి, జీవితమంతా యథేచ్ఛగా విషయాసక్తునిగా కాలం గడిపి, అంత్యకాలంలో భగవంతుని స్మరణ చేస్తే చాలునని భావించడం సరి కాదని సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. మంగళవారం హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతంపై ప్రవచనాన్ని కొనసాగించారు. అజామీళుడు వంటి వ్యక్తి ఒకరు ఉండవచ్చునని, కానీ అంత్యకాలంలో భగవంతుని స్మరణ కలగకపోతే, మన గతి ఏమిటని ఆయన ప్రశించారు. భగవద్గీతలో కృష్ణపరమాత్మ ‘అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కలేవరమ్’ అన్న శ్లోకానికి అర్థాన్ని ఆయన వివరించారు. అంత్యకాలంలో కూడా..అని శ్లోకభావమని, ‘చ’ అనే అక్షరం ఇదే భావాన్ని తెలియచెబుతోందన్నారు. అనంతరం ఆయన అభిమన్యువధకు దారితీసిన సన్నివేశాలను వివరించారు. సంశప్తక శక్తులతో అర్జునుడు పోరాడుతున్నాడు. ఆ సమయంలో ద్రోణుడు చక్రవ్యూహాన్ని పన్నాడు. కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, అభిమన్యుడు నలుగురికే ఛేదన ఉపాయం తెలుసు. అయితే, ఆపదపాలయినప్పుడు తాను వెనక్కు రాలేనని అభిమన్యుడు పేర్కొంటాడు. అర్జునుడు ఈ ప్రక్రియను అభిమన్యునికి నేర్పలేదని సామవేదం అన్నారు. సుభద్ర గర్భవతిగా ఉన్న సమయంలో ఈ విద్యను అర్జునుడు నేర్పుతుంటే, కృష్ణుడు అర్జునుని పిలిచాడని, ఆయన వ్యూహం గురించి పూర్తిగా చెప్పకుండా వచ్చేశాడని ఓ కట్టుకథ ప్రచారంలో ఉంది. ఇందులో వాస్తవం లేదు, లోకంలో అసత్యం వ్యాప్తి చెందినంతగా సత్యం ప్రాచుర్యం పొందడం లేదని సామవేదం అన్నారు.
పాండవుల గుణాలు, కృష్ణుని గుణాల కలపోత అభిమన్యుడు. అభిమన్యుని వెంటాడి వస్తున్న పాండవ పక్షాన ఉన్న వీరులను సైంధవుడు అడ్డుకున్నాడు. కురువీరులు అందరూ కలసి అభిమన్యుని వధించారు. వార్త విన్న ధర్మరాజు శోకమగ్నుడయ్యాడు. నారదుడు , వ్యాసుడు ధర్మరాజుకు మృత్యుస్వభావాన్ని వివరించారు. అభిమన్యు వధ తెలుసుకున్న అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా సైంధవుని వధిస్తానని ప్రతిన చేస్తాడు. అలా చేయలేకపోతే, నీటిలో ఉమ్మితే, మలమూత్రాలు విడిచితే కలిగే పాపం తనకు కలుగుతుందని ప్రకటిస్తాడు. పుష్కరాలు వస్తున్నాయి, నదులను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి, అలా చేయకపోతే, పుణ్యం కాదు కదా, పాపం వస్తుందని, సదాచారాన్ని అవహేళన చేయరాదని సామవేదం అన్నారు. యుద్ధ సమయంలో సైతం పాండవులు సంధ్యావందనాది నిత్యకర్మలు మానలేదని అన్నారు. అన్నాన్ని ఒడిలో పెట్టుకుని, మంచంమీద కూర్చుని తినరాదని ఆయన అన్నారు. ఊరిలో వేదనాదం వింటే ఊరంతటికీ క్షేమం కనుక వేదనాదాన్ని కాపాడుకోవాలని సామవేదం అన్నారు.


