ఎన్నికలేనా?
పర్సంటేజీల ప్రభావమా?
గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఆయా వార్డుల్లో ఎవరు నెగ్గితే వారి ఆధ్వర్యంలోనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా నెగ్గితే వారి పెత్తనం ఎక్కడ భరించాల్సి వస్తుందో.? పుష్కర నిధుల పనుల్లో వాళ్లకు సైతం పర్సంటేజీలు పంచాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికల నిర్వహణకు ముందుకురావడం లేదని సమాచారం. ఎన్నికలు జరిగితే టీడీపీతో పాటు కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ అభ్యర్థులకు కొన్ని స్థానాలు కేటాయించాల్సి ఉంది. దీనికితోడు మేయర్ స్థానం తమదే నంటూ జనసేన నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. మరో వైపు బీజేపీ సైతం మెజార్జీ కార్పొరేటర్ స్థానాలు ఆశిస్తోంది. ఇలాంటి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికలు జరిగితే పట్టు కోల్పోతామన్న మీమాంస ఎమ్మెల్యేల్లో నెలకొన్నట్లు సమాచారం. అందుకే ఎన్నికలకు ఎవరూ మొగ్గుచూపడం లేదన్న భావన ప్రజలు, రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
● రాజమహేంద్రవరం కార్పొరేషన్
ఎన్నికలకు కుదరని ముహూర్తం
● రూరల్, సిటీ నియోజకవర్గాల
ఎమ్మెల్యేల విముఖత
● త్వరలోనే నిర్వహిస్తామని
మంత్రి నారాయణ వెల్లడి
● ప్రకటించి నెలలు గడుస్తున్నా
నేటికీ కనిపించని పురోగతి
● 2027లో గోదావరి పుష్కరాలు
● ఎన్నికలు నిర్వహిస్తే పుష్కర నిధుల్లో వాటాలు పంచాల్సి వస్తుందన్న మీమాంస
సాక్షి, రాజమహేంద్రవరం: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కలగానే మిగలనున్నాయా? ఇందుకు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణమా? ఇద్దరి విభేదాల మధ్య ఎన్నికల ప్రక్రియ ముందుకు కదలడం లేదా? లేదంటే పుష్కరాల పనుల్లో పర్సంటేజీల ప్రభావమా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీకే దిక్కు లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.
పుష్కరాల దృష్ట్యా ప్రాధాన్యం
గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పుష్కర పనులు, ఏర్పాట్లు, నిర్వహణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే జరగనుంది. పనులు సవ్యంగా జరగాలంటే కార్పొరేషన్‌కు పాలకవర్గాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ పోస్టును సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు సైతం నిర్వహిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న వివాదాలను పరిష్కరించి రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి వ్యాఖ్యలతో గతేడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. మంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదు. ఈ పరిణామం నగర వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు రాజమహేంద్రవరం మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది.
ఆధిపత్య పోరాటం
కార్పొరేషన్ ఎన్నికలకు 2027 పుష్కరాలే అడ్డంకిగా మారుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇందుకు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఉన్న వర్గ విభేదాలే కారణంగా నిలుస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమహేంద్రవం సిటీలో మంచి పట్టుంది. విలీన గ్రామాలతో ఎన్నికలు జరిగితే తన వర్గం కార్పొరేటర్లతో సిటీలో చక్రం తిప్పే యోచనలో ఆయన ఉన్నారు. పుష్కరాల్లో సైతం తన హవా కొనసాగించవచ్చన్న భావనలో విలీన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం సిటీలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అన్నింటా తమ అనుచరులే చక్రం తిప్పుతున్నారు. ఇసుక, మద్యం సిండికేట్లలో తమ సత్తా చాటుతున్నారు. మధ్యలో బుచ్చయ్య వర్గీయులు వస్తే తమ ఆధిపత్యానికి ఆటంకం ఏర్పడుతుందన్న భావనలో ఉన్న వాసు.. విలీనం లేకుండా ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారు. ఇద్దరు నేతలూ ఎన్నికలకు ౖపైపెన సుముఖంగా ఉన్నట్లు కనిపించినా.. అంతర్గతంగా మాత్రం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి నారాయణ సూచనలను సైతం పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాలన, అభివృద్ధిపై ప్రభావం
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు పాలకవర్గం లేకపోవడంతో పాలన, అభివృద్ధి కుంటుపడిందన్న వాదన నెలకొంది. కార్పొరేషన్ అభివృద్ధి సైతం నత్తకు మేనత్తలా మారింది. నగర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. నగర సమస్యలపై సమావేశంలో చర్చలు జరిపి పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. కలెక్టర్ స్పందిస్తే తప్ప ప్రజల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. అధికారుల ఆధ్వర్యంలో పాలనాపరమైన వ్యవహారాలు జరుగుతుండటంతో ఎవరికీ జవాబుదారీతనం ఉండటం లేదు. ముఖ్యమైన విషయాల్లో సైతం నిర్ణయాలు తీసుకోవాలంటే కాలయాపన తప్పడం లేదు. ఎన్నికలు జరిగితే అభివృద్ధి పనులపై ప్రతిపక్ష సభ్యుల నిఘా ఉండటంతో పనుల్లో పారదర్శకత ఉండేది. ప్రస్తుతం ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు అభివృద్ధి పనులు చేపట్టి నిధులు డ్రా చేసేస్తున్నారు. అవినీతికి ఎక్కువ ఆస్కారం దక్కినట్లయింది.
ఇదీ సంగతి..
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు 2012 తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. 2018 నుంచి పాలకవర్గం లేకపోవడంతో కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను నగరంలో విలీనం చేసే వ్యవహారం నడుస్తోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. రూరల్‌లోని గ్రామాలు విలీనం చేయకుండా ప్రస్తుతమున్న 50 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వాసు, విలీన గ్రామాలతో ఎన్నికలు నిర్వహించాలని బుచ్చయ్యచౌదరి పట్టుబడుతుండటంతో ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వైరం తమకు పదవులు దక్కకుండా చేస్తోందన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది.


