నేరాల నివారణకు గ్రామ, వార్డు సందర్శన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేర నివారణాత్మక పోలీసింగ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సందర్శన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎస్పీ డి.నరసింహకిశోర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ప్రజల చెంతకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు, నేరాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇసుక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించాలని రాష్ట్ర మైన్స్, జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో మైన్స్ శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో ఇసుక సరఫరా, ఉచిత ఇసుక పాలసీ అమలు, అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణ, ప్రజల సంతృప్తి అంశాలపై విస్త్రతంగా జరిగింది. మంత్రి మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల నిర్వాహకులు అపరాధ రుసుములపై చేసిన ఆరోపణలను పరిశీలిస్తామన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ డి. నరసింహకిశోర్ మాట్లాడుతూ ఇసుక లారీలలో ఓవర్ లోడింగ్ అరికట్టాలని, నదుల్లో బోట్ల ద్వారా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడానికి ఇతర విభాగాలతో పోలీసుశాఖ సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు. జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు ఎకై ్సజ్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆ శాఖ వార్షిక క్యాలెండర్‌ని ఆవిష్కరించారు.
11న అండర్–12
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): ఈ నెల 11న అండర్–12 విభాగం క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి వెంకటేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 సెప్టెంబర్ 1 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానానికి ఆ రోజు ఉదయం 8 గంటలకు సంబంధిత అర్హత పత్రాలతో హాజరు కావాలని కోరారు.
‘అతిథిలా వచ్చి వెళ్తున్న పవన్’
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఏటా సంక్రాంతి సంబరాలు జరుపుకొంటున్నామని, అటువంటిది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి కొత్తగా ఈ సంబరాలు నిర్వహించడమేమిటని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. కాకినాడలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పవన్.. ఇక్కడకు ఓ అతిథిలా వచ్చి, వెళ్తున్నారని విమర్శించారు. కీలకమైన కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని కాకుండా.. తన మాట వినే డమ్మీ అధికారులను ఎంపీ సానా సతీష్ నియమిస్తున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న రాజమహేంద్రవరానికి ఐఏఎస్‌ను నియమించి, కాకినాడలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నగరం ప్రస్తుతం చాలా అధ్వానంగా తయారైందని అన్నారు. ఓఎన్‌జీసీ నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ప్రాణాలతో ఆ సంస్థ చెలగాటమాడుతోందని ఆరోపించారు. సామ్రాజ్యవాద అహంకారంతో చిన్నచిన్న దేశాలపై ఆర్థిక, సైనిక, వైమానిక దాడులకు పాల్పడుతూ ప్రపంచ శాంతికి అమెరికా ముప్పుగా మారిందని మధు అన్నారు. వివిధ అంతర్జాతీయ సమస్యలను సాకుగా చూపుతూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురోను, ఆయన భార్య సిలియో ఫ్లోర్స్‌ను అరెస్టు చేసి నిర్బంధించడం ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిపై చేసిన ఘోర దాడిగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ట్రంప్ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికీ దీనిపై స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.


