క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్‌గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


