సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్‌సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్‌సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్‌సైట్‌లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు


