చంద్రబాబుది స్కాముల ప్రభుత్వం
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబుది స్కాముల ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 2025 సంవత్సరం చంద్రబాబు స్కాముల మయంగా మారిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలతో పాటు.. సూపర్ 6, సూపర్ 7 పథకాలంటూ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. నేడు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశంలోనూ ఒక్కో స్కామ్ వెలుగు చూస్తోందన్నారు. పేదలు కొత్తగా ఒక్క పెన్షన్ మంజూరుకు మాత్రం నోచుకోవడం లేదని, చంద్రబాబు తన వాళ్లకు ప్రభుత్వ ఆస్తులను పంచిపెట్టేసి, అందులో నుంచి కమీషన్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల భూములను లీజుల పేరిట చౌకగా కట్టబెట్టేస్తున్నారన్నారు. రాజధాని పనుల విలువలు పెంచేసి నిబంధనలకు విరుద్ధంగా తనవారికే కట్టబెట్టి దోచుకుంటున్నారన్నారు. ఆలయ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. బిల్లు కట్టలేదని సాక్షాత్తూ విజయవాడ దుర్గ గుడికే కరెంటు కట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని వేణు ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం ఆలయాల్లో అమాయక భక్తులు చనిపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని దుయ్యబట్టారు. మాట నిలబెట్టుకోలేని వ్యక్తి పాలన ఎలా ఉంటుందో చంద్రబాబును చూస్తే అర్థమవుతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు ప్రాణాలు కోల్పోవడం చంద్రబాబు వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ చంద్రబాబు స్వార్థం తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండటం లేదని అన్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి, వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవాలని మాత్రమే చూస్తున్నారన్నారు. ఉద్యోగులు ప్రజలకు మాత్రమే జవాబుదారీ, వారు పని చేయాల్సింది ప్రజలకోసమేనని వేణు స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలకు అభ్యంతరం చెప్పాలని, కానీ, రాష్ట్రంలో వ్యవహారం అందుకు విరుద్ధంగా సాగుతోందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చారని చెబుతూ, ప్రత్యర్థి నోట ప్రశంస పొందిన వారే నిజమైన పాలన అందించినట్లని, పేరు మార్పు ద్వారా జగన్ పాలన బంగారమని చంద్రబాబే ఒప్పుకున్నట్లయ్యిందని విశ్లేషించారు. 2025 చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి.. 2026వ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో ఆనందాలు తీసుకు రావాలని వేణు ఆకాంక్షిస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


