ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు
● నిబంధనలు అతిక్రమిస్తే జైలుకే
● జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ సూచన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాటించాల్సిన నియమ నిబంధనలపై మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యహరించే వారికి జైలు తప్పదని హెచ్చరించారు.
● ప్రభుత్వం నిర్దేశించిన సమయం ముగిసిన వెంటనే మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు విధిగా మూసివేయాలి.
● మద్యం తాగి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అటువంటి వారికి చట్ట ప్రకారం భారీ జరిమానాలతో పాటు, వారం రోజుల వరకూ జైలు శిక్ష తప్పదు.
● మద్యం తాగిన వారు ఆల్కహాల్ స్థాయి 30 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఉన్నచోటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలి. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం.
● బైకులపై విన్యాసాలు, రేసింగ్‌ల వంటివి చేసిన వారిపై రౌడీ షీట్లు తెరుస్తాం.
● రోడ్లపై, ర్యాష్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.
● మైనర్ బాలబాలికలు తల్లిదండ్రులు లేకుండా రాత్రి వేళ తిరగరాదు.
● రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళ కేక్ కటింగ్‌లు, మందుగుండు సామగ్రి కాల్చడం, ఇతర వేడుకలు పూర్తిగా నిషేధం.
● అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత సరైన కారణం లేకుండా రోడ్లపై తిరగరాదు.
● న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎటువంటి శాంతిభద్రతల సమస్యలూ తలెత్తకుండా బాధ్యత వహించాలి.
● బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్ల వినియోగించరాదు. శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తాం.
● మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసులు, శక్తి టీములు మఫ్టీలో రంగంలోకి దిగుతాయి.
● నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అన్ని రకాలుగా బందోబస్తు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన రోడ్లు, ముఖ్యమైన జంక్షన్ల వద్ద పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు.
● న్యూ ఇయర్ వేడుకల ముసుగులో పేకాటలు, కోడిపందేలు, జూదం వంటివి నిర్వహించినా, ఆడినా, అశ్లీల నృత్యాలు నిర్వహించినా ప్రత్యేక బృందాల ద్వారా రైడ్‌లు నిర్వహిస్తాం.
● పోలీస్ కంట్రోల్ రూము నుంచి సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తాం.


