తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని,, పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి మంగళవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా నలుమూల నుంచీ ఆలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకూ స్వామి వారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ఆధ్వర్యాన సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఉచిత, రూ.20, రూ.50 క్యూలలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారిని ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మ న్ తుమ్మల బాబు దర్శించుకుని, పూజలు చేశారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలుగా అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు.
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు


