రత్నగిరి.. వివాదాలే సరి.. | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి.. వివాదాలే సరి..

Dec 31 2025 7:26 AM | Updated on Dec 31 2025 7:26 AM

రత్నగ

రత్నగిరి.. వివాదాలే సరి..

అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు

కలిసిరాని 2025

పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి

పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలు

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్‌ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్‌ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి.

భక్తులకు కొంచెం ఊరట

2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్‌ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్‌ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం.

ఆదాయంలోనూ వెనుకంజ

శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది.

సేవల్లో చివరి ర్యాంకు

రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్‌.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి.

ఆవు నెయ్యిపై..

స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్‌ నుంచి టెండర్‌ పిలవాలని కమిషనర్‌ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్‌లాల్‌, కమిషనర్‌ రామచంద్రమోహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్‌మెంట్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్‌ టెండర్‌ కోట్‌ చేసి దక్కించుకుంది.

ప్రజాప్రతినిధుల జోక్యం

అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది.

వివాదాస్పదం

ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్‌, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్‌ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్‌ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్‌ చేయడం సంచలనం రేపింది.

ఈఓగా త్రినాథరావు

దేవస్థానం ఈఓ (ఫుల్‌ అడిషనల్‌ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్‌ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.

పాలనా వైఫల్యాలు

గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది.

రత్నగిరి.. వివాదాలే సరి..1
1/3

రత్నగిరి.. వివాదాలే సరి..

రత్నగిరి.. వివాదాలే సరి..2
2/3

రత్నగిరి.. వివాదాలే సరి..

రత్నగిరి.. వివాదాలే సరి..3
3/3

రత్నగిరి.. వివాదాలే సరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement