హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ
● ముగ్గురు నిందితుల అరెస్టు
మామిడికుదురు: హైదరాబాద్‌లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మల్లాపూర్ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


