నర్సరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి
కడియం: నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరికి సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ఆమెను అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, పాలకవర్గ సభ్యులు కలిశారు. మొక్కలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. సాయిల్ లెస్ మీడియాపై కోకోపిట్ స్టబిలైజేషన్, టిష్యూకల్చర్ ల్యాబ్ వంటి తదితర అంశాలపై చర్చించారు. కాగా.. తాము వివరించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అయ్యప్ప తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఉద్యానశాఖ అధికారి మల్లికార్జున, కడియం ఉద్యానశాఖ అధికారి లావణ్య, అసోసియేషన్ పాలకవర్గం బోడపాటి గోపి, కొండేపూడి నాగు, తాడాల నాగేశ్వరరావు, బాబ్జీ, పిల్లా శ్రీనివాస్, బోడపాటి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నొడగల బుచ్చిరాజు పాల్గొన్నారు.
రమ్యసుధకు జాతీయ ఉత్తమ పరిశోధన అవార్డు
రంగంపేట: అహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఈ నెల 21న ఆల్ ఇండియా రామానుజన్ మ్యాథ్స్ క్లబ్, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు రమ్యసుధ జాతీయ ఉత్తమ పరిశోధన ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు అయిన ఆమె అనేక పరిశోధనా వ్యాసాలు రాసి, పలు శాసీ్త్రయ ప్రాజెక్టులు తయారు చేసి, పలు ప్రదర్శనలలో ఉత్తమ బహుమతులు పొందుతున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. రమ్యసుధ పరిశోధనలు మన దేశంతో పాటు జపాన్, మలేషియా, నేపాల్ వంటి దేశాల్లో ప్రదర్శింపబడి సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కాగా.. రమ్యసుధను రంగంపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు వీసీ జాకబ్, వరలక్ష్మి అభినందించారు.
నర్సరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి


