
వరలక్ష్మీ నమోస్తుతే..
● రత్నగిరిపై ఉచిత సామూహిక
వరలక్ష్మీ వ్రతాలు
● పాల్గొన్న 9,680 మంది మహి ళ లు
అన్నవరం : నిత్యం సత్యదేవుని నామజపంతో మార్మోగే రత్నగిరి శ్రావణమాసం ఐదో శుక్రవారం మాత్రం వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామ జపంతో మార్మోగింది. దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. నిత్యకల్యాణ మండపంతో బాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలు, వాయవ్య, నైరుతి వ్రత మండపాలలో ఈ వ్రతాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బ్యాచ్‌లలో 9,680 మంది మహిళలు ఈ వ్రతాలు ఆచరించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి ఆలయ ప్రాంగణం మహిళలతో కిటకిట లాడింది. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణ మండపం వేదిక మీద ప్రతిష్ఠించిన వరలక్ష్మీ అమ్మవారికి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం పూజలు చేసి హారతి ఇచ్చారు. కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు మహిళలతో వరలక్ష్మీ వ్రతం చేయించారు. వరలక్ష్మీ వ్రతకథను పాలంకి పట్టాభిరామ్మూర్తి చదివి వినిపించారు. హాజరైన మహిళలకు ఉచితంగా జాకెట్టుముక్క, సత్యదేవుని ప్రసాదం, అమ్మవారి రాగిరూపు, చేతికి కట్టుకునే తోరం అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో వీరికి భోజన సౌకర్యం కలుగజేశారు. మహిళలు గంటల తరబడి క్యూ లో నిలబడాల్సి వచ్చింది. దాంతో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని వ్రతాల ఆఫీసులోకి తరలించి తోటి మహిళలు సపర్యలు చేశారు. అధికారులు రామాలయం వద్ద గల వార్షిక కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించి ఉంటే గంటల తరబడి మహిళలు వేచియుండే అవసరం ఉండేది.
ప్రత్యేక అలంకరణలో వరలక్ష్మీ అమ్మవారు

వరలక్ష్మీ నమోస్తుతే..