
మునిసిపాలిటీలలో పనితీరు మెరుగుపరచాలి
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రధాన పనితీరు సూచికల అమలులో స్పష్టమైన ఫలితాలు ప్రతిబింబించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగర పాలక కార్యాలయంలో కలెక్టర్, ఇన్‌చార్జ్ కమిషనర్ పి. ప్రశాంతి సమక్షంలో అధికారులతో కేపీఐ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పుష్కరాల్లో రద్దీ నియంత్రణ కోసం ప్రతీ ఘాట్ వద్ద ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ సహాయంతో భక్తుల రద్దీని పసిగట్టి ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైందని, అందుకే గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేసేలా ప్రతిపాదనలు, డీపీఆర్ అందచేయాలన్నారు. నగరంలో ఉన్న 1.12 లక్షల గృహాలకు అసెస్‌మెంట్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. మెరుగైన విధానంలో నీటి సరఫరా వినియోగం ఉందని, నీటి కనెక్షన్లు 100శాతం ఆన్‌లైన్‌లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ 99.42 శాతం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్‌ఈడీ బల్బుల వినియోగం పెంచాలని, టాక్స్ కలెక్షన్, ఆటో మ్యూటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ పాల్గొన్నారు.
పురపాలకశాఖ
ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్