
ముగిసిన గిరిజన ప్రాచీన విజ్ఞాన సదస్సు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ – భవిషత్ తరాలకు చేర్చడం’ అనే అంశం పై రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు శుక్రవారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. ఇథోఫియా, ఇరాక్ వంటి దేశాల నుంచి వచ్చిన పరిశోధకులతోపాటు వివిధ అంశాలపై 65 మంది పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. వీటి నుంచి ఉత్తమ పరిశోధనలుగా ఎంపిక చేసిన 40 పరిశోధన పత్రాలతో ఒక పుస్తకాన్ని ముద్రించదలచామన్నారు. పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్‌ఎస్ వరహాలదొర, కో కన్వీనర్లు డాక్టర్ ఎం. గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు పాల్గొన్నారు.