
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ నరసింహకిశోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న వినాయక చవితి వేడుకలపై పోలీసుశాఖ షరతులతో కూడిన నిబంధనలు జారీ చేసింది. మండపంలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన నాటి నుంచి నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలివీ...
● గణేష్ మండపాలు, పందిర్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా అనుమతి పొందాలి. పోలీసు అనుమతి లేకుండా విగ్రహాలు, పందిరి, మండపాలు ఏర్పాట్లు చేయరాదు.
● విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టంలను ఉపయోగించరాదు.
● సాధారణ సౌండ్ బాక్స్‌లు మాత్రమే అనుమతించబడతాయి. మైక్ పర్మిషన్‌కు సంబంధిత డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. విగ్రహాల ఎత్తు 5 అడుగులు మించరాదు.
● ఈనెల 23వ తేదీలోగా మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసువాలి.
● 27వ తేదీలోగా వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలి. 11 రోజుల తరువాత నిమజ్జనాలు అనుమతించరు.
● పబ్లిక్ ప్రదేశాలలో మండపం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రైవేట్ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు స్థలం యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి.
గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కి, ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకూడదు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదు. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు ఎలక్ట్రికల్ షాక్ లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
అనుమతి ఈ విధంగా పొందాలి
నిర్వాహకులు గణేష్‌ఉత్సవ్.నెట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. వెరికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు ఓపెన్ అవుతుంది. దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా , కమిటీ పేరు, గణేష్ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు. ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. గణేష్ నిమజ్జనం తేది, సమయం, వాహన వివరాలు ఎంటర్ చేయాలి. దీని ఆధారంగా పోలీసులు వచ్చి మండపం ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తారు. అనుమతి వచ్చిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్‌ను మండపంలో ప్రదర్శించాలి. తనిఖీ అధికారులు వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్‌ను పరిశీలిస్తారు.