ముగింపు దశకు స్థానికం | - | Sakshi
Sakshi News home page

ముగింపు దశకు స్థానికం

Aug 26 2026 12:18 AM | Updated on Aug 26 2026 12:18 AM

సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల పాలన ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పదవీకాలం పూర్తికాగా, సెప్టెంబర్‌ 24తో జిల్లా పరిషత్‌తో పాటు 64 మండల పరిషత్‌ల పదవీకాలం కూడా ముగియనుంది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు సంబంధించి ఎన్నికల పోలింగ్‌ 2021 ఏప్రిల్‌ 8న జరగగా, సెప్టెంబర్‌ 19న ఓట్ల లెక్కింపు జరిగింది. అప్పటి ఉమ్మడి జిల్లాలో మొత్తం 62 జెడ్పీటీసీ స్థానాలకు గాను 61 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైఎస్సార్సీపీ 61, టీడీపీ 1 స్థానాల్లో విజయం సాధించాయి. సెప్టెంబర్‌ 25న పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌ 24తో ముగియనుంది. జెడ్పీ చైర్మన్‌, ఇద్దరు వైస్‌ చైర్మన్లు, జెడ్పీటీసీలు పదవులు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉమ్మడి జిల్లా పరిషత్‌ చివరి సర్వసభ్య సమావేశం జరగనుంది. వచ్చే నెల 24లోపు వీడ్కోలు సభ జరిగే అవకాశం ఉన్నప్పటికీ, 28న జరిగేదే అధికారికంగా ఆఖరి సభగా పరిగణించనున్నారు.

ఇదే చివరి ఉమ్మడి జెడ్పీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు ఇప్పుడున్నదే చివరి పాలకవర్గం కానున్నది. ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా చేసి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇదే జరిగితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు ఇదే చివరి పాలకవర్గం, ఇప్పుడున్న విప్పర్తి వేణుగోపాలరావు చివరి చైర్మన్‌ కానున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌ 4న జిల్లాల పునర్విభజన జరిగి ఉమ్మడి తూర్పుగోదావరి నాలుగు జిల్లాలుగా విడిపోయింది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలతో పాటు రంపచోడవరం, చింతూరు డివిజన్లు తొలుత అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లాయి. తరువాత రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపి 2025 డిసెంబర్‌లో పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నాలుగు జిల్లాల పరిధిలో ఉంది. మండల పరిషత్‌ల విషయానికొస్తే, జిల్లాలోని 62 మండల పరిషత్‌లకు చెందిన ఎంపీపీలు, వాటి పరిధిలోని 1,184 మంది ఎంపీటీసీల పదవీకాలం కూడా వచ్చే నెల 23లోపు పూర్తి కానుంది. వీరు కూడా చివరి సర్వసభ్య సమావేశాలకు సిద్ధమవుతున్నారు.

కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన..

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు, పంచాయతీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, కాకినాడ జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని, తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు మున్సిపాలిటీల పదవీకాలం మార్చి 11న ముగిసింది. ఏప్రిల్‌ 2 నాటికి పంచాయతీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. వీటికి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాధించని విధంగా 90 శాతానికి పైగా విజయాలు కై వసం చేసుకుంది. ఇదే కూటమి ప్రభుత్వానికి కడుపుమంటగా మారింది. 2024లో సాధారణ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్షత చూపింది. మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లలో స్థానిక ఎమ్మెల్యేల పెత్తనాలు పెరిగిపోయాయి. అధికారులు కూడా వారికే వత్తాసు పలకడంతో నిధులు కేటాయించకుండా స్థానిక సంస్థల లక్ష్యాలను నిర్వీర్యం చేశాయి. ఇప్పుడు జెడ్పీ, ఎంపీపీల పదవీకాలం కూడా వచ్చే నెలతో ముగియనుండటంతో పూర్తిగా అధికారుల పాలన రానుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పైకి చెబుతున్నా... ఏదో ఒక రూపంలో వాయిదా వేసేలా ప్రభుత్వం చర్యలు ఉండడంతో ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం కలగడం లేదు.

ఇప్పటికే పంచాయతీలు,

మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన

జెడ్పీలు, మండలపరిషత్‌లకు

సెప్టెంబర్‌ 24తో ముగియనున్న గడువు

గత రెండేళ్లుగా అభివృద్ధికి

సొమ్ములు లేవు

ఎన్నికలపై ఇప్పటికీ ఊగిసలాటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement