రామచంద్రపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన టెట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ద్రాక్షారామ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ మేరకు భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుని టెట్ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం టెట్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ టెట్ రద్దు కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహణను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్, ఎస్‌టీయూ, ఆపస్, పీఆర్‌టీయూ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘాట్ల పనులు
వేగవంతం చేయాలి : జేసీ
అమలాపురం రూరల్: గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఘాట్ల నిర్వహణ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై ఖోమ్ నైడియా దేవి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర సీఎం చంద్రబాబు జూమ్ మీటింగ్ ద్వారా అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఘాట్ల అభివృద్ధి, ఆధ్యాత్మిక దేవాలయాల నిర్వహణ, పర్యాటకం, మౌలిక వసతుల కల్పనపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆయా వివరాలపై జేసీ అధికారులతో మాట్లాడుతూ పోలీస్, దేవదాయ, పర్యాటక, ఇరిగేషన్, పంచాయతీ శాఖల సమన్వయంతో నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకొని గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ నియంత్రణపై దృష్టి సారించి, బస్సుల రాకపోకల విషయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున తాత్కాలిక గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, దేవదాయ, ఇరిగేషన్ పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
27న మినీ ఉద్యోగ మేళా
అమలాపురం రూరల్: ఈ నెల 27న కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, ఎస్‌ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. వికాస జిల్లా మేనేజర్ గోళ్ళ రమేష్ మాట్లాడుతూ నాలుగు ఎంఎన్‌సీ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని, అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు.


