జిల్లా పోలీస్‌ కార్యాలయానికి రూ.2 కోట్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లా పోలీస్‌ కార్యాలయానికి రూ.2 కోట్లు

Aug 26 2026 12:18 AM | Updated on Aug 26 2026 12:18 AM

అమలాపురం టౌన్‌: జిల్లా కేంద్రం అమలాపురంలో ఏడు ఎకరాల్లో నిర్మితమవుతున్న జిల్లా పోలీస్‌ కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ రూ.2 కోట్ల నిధులు కేటాయించారని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. అమలాపురం పాత పోలీస్‌ క్వార్టర్స్‌, జిల్లా పోలీస్‌ గ్రౌండ్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ (డీఎస్పీ కార్యాలయం)ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పుష్కరాల లోపు జిల్లా పోలీస్‌ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం అమలాపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి అమలాపురం డీఎస్పీ కార్యాలయం లేదు కాబట్టి నూతనంగా నిర్మించిన ఈ పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌ను కొద్ది రోజులు డీఎస్పీ కార్యాలయంగా ఉపయోగించుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, పేరాబత్తుల రాజశేఖర్‌, అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు పాల్గొన్నారు.

త్వరలో పోలీసు పోస్టుల భర్తీ

ఆలమూరు: ఏలూరు రేంజ్‌ పరిధిలోని జిల్లాలన్నింటిలో పోలీసు శాఖ ఎదుర్కొంటున్న ఖాళీల కొరతను అధిగమించేందుకు త్వరలోనే కొత్త నియామకాలు జరుగుతాయని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ఆలమూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకు ప్రారంభోత్సవానికి మంగళవారం వచ్చిన ఆయన ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనాతో కలసి ఆయన మాట్లాడారు. కొత్త నియామకాల కోసం రిక్రూట్‌మెంట్‌ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం అభ్యర్థులు శిక్షణలో ఉన్నారని, వచ్చే నెలాఖరు నాటికి అన్ని జిల్లాల పరిధిలో పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. అమలాపురంలో రూ.రెండు కోట్ల వ్యయంతో డీపీఓ భవన నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే పుష్కరాల నాటికి ఈ జిల్లాలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, బ్యారెక్స్‌ను ఏర్పాటు చేసుకుని పోలీసు శాఖను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకంటున్నామన్నారు. ప్రస్తుతం పోలీస్‌ క్వార్టర్లను నిర్మించే ఆలోచన లేదన్నారు. రేంజ్‌ పరిధిలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. కొత్తపేట డీఎస్పీ ఎస్‌ మురళీకృష్ణ, రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌, టౌన్‌ సీఐ జి.రమేష్‌బాబు, ఎస్సై జి.నరేష్‌ పాల్గొన్నారు.

ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement