● ‘నన్నయ’లో ఘనంగా ‘పట్టాల’ పండగ ● మొత్తం 722 మందికి అందజేత ● 14 మందికి బంగారు పతకాలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం సందడిగా సాగింది. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ పట్టాల పండగలో పాల్గొన్నారు. చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 14 మంది బంగారు పతకాలు అందుకున్నారు.
పట్టభద్రులు దేశాభివృద్ధిలో కీలకం :
చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉన్నత చదువులతో పట్టభద్రులైన వారందరూ సమాజ హితంగా పయనాన్ని కొనసాగిస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన ‘నన్నయ’ పేరిట ఏర్పడిన ఈ యూనివర్సిటీ దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా అభివృద్ధిని సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ‘వసుదైక కుటుంబం’ అనే భావనతో ముందుకు సాగాలన్నారు. యూనివర్సిటీలోని కన్వెన్షన్ హాలులో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి 16, 17 స్నాతకోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. 45 మందికి బంగారు పతకాలు, పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. పట్టాలు అందుకునేందుకు 722 మంది దరఖాస్తు చేసుకోగా, మిగిలిన వారికి వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అతిథులు జేఎన్‌టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, యాప్షీ చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిల చేతుల మీదుగా అందజేశారు.
‘నన్నయ’ కీర్తిని ఇనుమడింపజేసేలా..
వీసీ ప్రసన్న శ్రీ
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి జిల్లావాసుల చిరకాల కోరిక మేరకు ఆవిర్భవించిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యను అందస్తోందన్నారు. తెలుగు సాహిత్యానికి ఆదికవి అయిన నన్నయ భట్టారకుని కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఆరు జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా నిలిచిందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులను సమాజానికి కావలసిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు.
డిగ్రీ ప్లస్ విధానం అవసరమే :
ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా
జేఎన్‌టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా మాట్లాడుతూ విద్యార్థులు ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్ శాఖల అధ్యయనం వైపు అడుగులు వేయాలని సూచించారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరాన్ని ప్రస్తావిస్తూ, పాఠ్యాంశాలతోపాటు నైపుణ్యాలు, సృజనాత్మకత, అనుభవాత్మక అభ్యాసం కూడా అవసరమనే విషయాన్ని గ్రహించాలన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో చదువును మరచిపోకుండా నిరంతరం పుస్తక పఠన చేయాలన్నారు. అందుకు అనుగునంగా తల్లిదండ్రులు కూడా నచుకోవాలని, ఇంటిలోని ర్యాక్‌లలో భాగవత, రామాయణాలతోపాటు చరిత్రను తెలియజేసే పుస్తకాలను కూడా పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉంచాలని సూచించారు.
ఘన స్వాగతం
స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కులపతి హోదాలో వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలోని హెలీపాడ్ వద్ద ఉదయం 11 గంటలకు కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రజాప్రతినిధలు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.
722 మందికి పట్టాల ప్రదానం
2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు చెందిన పీహెచ్‌డీ, పీజీ, పీజీ డిప్లమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి, దరఖాస్తు చేసుకున్న 722 మంది విద్యార్థులకు పట్టాలను ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అందజేశారు. వీరిలో 21 మంది పీహెచ్‌డీ, 14 మంది గోల్డ్ మెడల్స్, 10 ప్రైజ్‌లు పొందిన వారున్నారు. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన 6,113 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 45,337 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించేందుకు చాన్సలర్ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య మునిరత్నంనాయుడు, జీజీయూ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


