పైశాచిక వ్యాఖ్యలపై ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

పైశాచిక వ్యాఖ్యలపై ఫైర్‌

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

వైఎస్సార్‌ సీపీ నేతలను, వారి భార్యలను అవమానిస్తూ ఏబీఎన్‌ చానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. మహిళలపై జుగుప్సాకరంగా పైశాచిక రాతలు రాసిన ఆయనను తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తక్షణమే అరెస్టు చేయాలి : పొన్నాడ

ముమ్మిడివరం: మహిళలను కించపర్చే విధంగా దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ నేతలు ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ని యోజకవర్గ కోఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు నిరసన ర్యాలీ చేశారు. పొన్నాడ మాట్లాడుతూ సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ పితాని బాలకృష్ణ, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కాశి బాలమునికుమారి, జెడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శంకరరావు, టౌన్‌ పార్టీ అధ్యక్షుడు బొంతు సత్యశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

చర్యలు తీసుకోవాలి : సూర్యప్రకాశ్‌

రామచంద్రపురం: వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కే కార్యక్రమంలో చేసిన అవమానకర, అసత్య వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌ అన్నారు. నియోజకవర్గ పార్టీ నేతలతో కలిసి సూర్యప్రకాష్‌, రామచంద్రపురం సీఐ వెంకటనారాయణకు ఫిర్యాదు చేశారు. దూషణాత్మక వీడియోలను సోషల్‌ మీడియా వేదికల నుంచి తొలగించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీపీ అంబటి భవానీ, పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్‌, పి.వరప్రసాద్‌ పాల్గొన్నారు.

కొత్తపేట: నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యవహరిస్తున్న తీరు పాత్రికేయ విలువలను దిగజార్చే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు గురువారం కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జగ్గిరెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కొత్తపేట చేరుకోగా వారందరితో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై జీ సురేంద్రకు ఫిర్యాదు అందజేసి రసీదు తీసుకున్నారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాధాకృష్ణ తన మీడియాలో ప్రసారమైన కార్యక్రమంలో వివాహం అయిన మహిళలను ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచాతినీచంగా వ్యాఖ్యానించారన్నారు. వివాహ బంధాన్ని హేళన చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆలికి, చెల్లికి తేడా తెలియని మూర్కుడు రాధాకృష్ణ అని విరుచుకుపడ్డారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్‌, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్‌, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గూడపాటి ప్రవీణ్‌కుమార్‌, సీనియర్‌ నాయకుడు చల్లా ప్రభాకరరావు, మహిళా విభాగం సభ్యురాలు కొంబత్తుల మంగమ్మ పాల్గొన్నారు.

కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు

ఏబీఎన్‌ చానల్‌ ఎండీ రాధాకృష్ణను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

పోలీస్‌ స్టేషన్లలో వైఎస్సార్‌ సీపీ

నేతల ఫిర్యాదు

జర్నలిజం విలువలను

దిగజార్చారని ధ్వజం

మహిళలను అవమానించడంపై నిరసన

Advertisement
 
Advertisement
Advertisement